రాష్ట్రంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి 50 శాతం తాత్కాలిక భృతిని తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి(జాక్టో) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి 50 శాతం తాత్కాలిక భృతిని తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి(జాక్టో) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశానికి 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తామెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేదా ఆందోళనలు చేపట్టాలని తీర్మానించారు. కొత్త పీఆర్‌సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 50 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకున్న సదుపాయాలన్నింటినీ ఎయిడెడ్ టీచర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పి.వెంకట్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.