కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోగశాలగా మారింది. వారం రోజులుగా ఆయుర్వేదిక్ డాక్టర్‌గా చెప్పుకుంటున్న ఓ మహిళ థియేటర్‌లో హడావుడి చేస్తోంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే సదరు మహిళతో రోగులకు శస్త్రచికిత్సలు చేయిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ విషయం వెలుగులోకి రావడంతో... ‘న్యూస్‌లైన్’ ఆరా తీసింది. ఆపరేషన్ థియేటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇది వాస్తవమేనని వివరించారు. ఇప్పటికే రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ మోహన్‌రావు స్వయంగా సదరు మహిళను థియేటర్‌లోకి అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. సూపరింటెండెంట్‌కు చాలా దగ్గరివారు కావడంతో కాదనలేక పోతున్నామని, ఈ విషయంలో కొందరు డాక్టర్లు అభ్యత రం చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిసింది.
థియేటర్‌లో ప్రసవాలు, ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్న శస్త్రచికిత్సలను ఎలా చేయాలో దగ్గరుండి ఈ మహిళకు చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సదరు మహిళ రెండు, మూడు కేసులకు శస్త్రచికిత్సలు నిర్వహించారని తెలిసిం ది.
ఈ విషయంపై సూపరింటెండెంట్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, ఆమె తనకు దగ్గరి వారని, బీహెచ్‌ఎం ఎస్ చదువుతోందని వెల్లడించారు. ఆపరేషన్లు ఎలా చేస్తారో తెలుసుకుంటానంటే చూపిస్తున్నానే తప్ప, ఆమె చేత శస్త్రచికిత్సలు చేయించడం లేదని పేర్కొన్నారు. డీసీహెచ్‌ఎస్ నుంచి అనుమతి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కొంతకాలంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోడంతో ఆస్పత్రిలో వైద్యుల నుంచి సిబ్బంది వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఇలాంటి సంఘటనలతో రుజువువుతున్నాయి.
ప్రాణాలతో చెలగాటం
Published Wed, Sep 18 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement