వెంకటేశ్వరపురంఫేస్2లో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు
పట్టణ ప్రాంతాల్లోని ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తామని గొప్పలు చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా లబ్ధిదారులకు గాలి మేడల సినిమా చూపించింది. ఎన్నికలకు ఏడాది సమయంలో అందరికీ ఇళ్ల సముదాయాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నిర్మిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అరకొరగానే పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న, పునాదులకే నోచుకోని ఇళ్లకు సైతం లాటరీలు తీసి లబ్ధిదారులకు కేటాయించి మోసం చేసింది. బ్యాంక్ రుణంతో మెలిక పెట్టడంతో ఒక్కరంటే ఒక్కరికీ ఇల్లు స్వాధీన పరిచిన దాఖలాలు లేవు.
సాక్షి, నెల్లూరు సిటీ: పట్ణణాల్లోని పేదల సొంతింటి కల పగటి కలగా మారిది. అందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు ఇస్తామని ఆశలు రేపిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో హడావుడిగా అపార్ట్‌మెంట్ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐదేళుగా మోసం చేస్తూ వచ్చి అధికార అంతమున కట్టడాలే పూర్తికాని, పునాదులే వేయని ఇళ్లకు గ్రాఫిక్స్ సినిమా చూపించి ఆన్‌లైన్ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆఖరిలో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తలు పన్నిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో 4,800, అల్లీపురంలో 12,288, అక్కచెరువుపాడులో 3,696, కల్లూరుపల్లిలో 3,168, కొండ్లపూడిలో 2,544, వెంకటేశ్వరపురం ఫేజ్–2లో 7,536 మొత్తం 34,032 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీటిలో కేవలం వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా ఆ ఇళ్లలో కుళాయిలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. మిగిలిన 29,232 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కల్లూరుపల్లి, కొండ్లపూడి, వెంకటేశ్వరపురం ఫేస్–2లో ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఇళ్లను ఆన్‌లైన్ పద్ధతిలో లాటరీలో లబ్ధిదారులకు కేటాయించారు.
నాసిరకం ఇళ్లు మాకొద్దంటున్న లబ్ధిదారులు
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించిన లబ్ధిదారులు ఆ నాసిరకం ఇళ్లు తమకొద్దంటూ సుమారు 3 వేల మందికి పైగా నిరాసక్తత చూపిస్తున్నారు. ఇప్పటికే 700 మంది లబ్ధిదారులు కార్పొరేషన్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా వినతిపత్రాలు ఇచ్చారు. లబ్ధిదారులు రూ.12,500, రూ.25 వేలు వంతున నాలుగు విడతల్లో రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. అయితే కేవలం ఒక విడతలో మాత్రమే డబ్బులు చెల్లించారు. మరో మూడు విడతలు డబ్బులు చెల్లించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. తాము కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.
పూర్తికాని గృహాల్లో ప్రవేశాలు
ఇళ్లను లాటరీ ద్వారా కేటాయించారు. కానీ లబ్ధిదారులకు నివాసానికి అనుకూలమైన పరిస్థితులు మాత్రం లేవు. నెల రోజుల క్రితం చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రచారం కోసం రెండు ఇళ్లలో మాత్రమే గృహ ప్రవేశం చేయించారు. వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు గృహప్రవేశం జరిగినట్లు చెప్పారు. అయితే నెల రోజులు గడుస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి తాళం కూడా ఇవ్వలేదు. వెంకటేశ్వరపురంలో నిర్మాణాలు పూర్తయ్యాయిని చెబుతున్న ఇళ్లకు విద్యుత్, తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదు.
వృద్ధులు, వికలాంగులకు మూడో ఫ్లోర్‌లో ఇళ్లు
70 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు అపార్ట్‌మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇళ్లు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అయితే కంప్యూటర్ లాటరీ పద్ధతిలో వృద్ధులు, వికలాంగులకు కేటాయించిన ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించలేదు. రెండు, మూడు ఫ్లోర్లలో ఇళ్లు కేటాయిండంతో అంత ఎత్తున ఎలా ఎక్కేది అని ఆందోళనకు గురవుతున్నారు. కాళ్లు లేని వారికి సైతం మూడో ఫ్లోర్‌లో ఇల్లు కేటాయించడం గమనార్హం.
కట్టారే కానీ.. అన్నీ ఖాళీ!
గూడూరు: గూడూరు పట్టణంలో హౌస్ ఫర్ ఆల్ ఇళ్లు దిష్టిబొమ్మల్లా మారాయి. నిర్మాణాలైతే జరిగాయే కానీ, అరకొర పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అక్కడ తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ ఆరు నెలల క్రితం లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లు కేటాయించారే కానీ, వాటిని ఇప్పటి వరకూ ఎవరికీ స్వాధీనం చేసిన దాఖలా లేవు. ఆ హౌస్ ఫర్ ఆల్‌లో ఇంకా రోడ్డు నిర్మాణ పనులతో పాటు, వాటర్ ట్యాంకు నిర్మాణం కూడా జరుగుతోంది. పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో గాంధీనగర్ సమీపంలో హౌస్‌ఫర్ ఆల్ పథకం కింద అపార్ట్‌మెంట్ల తరహాలో సుమారు 7 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటి వరకూ 5,120 ఇళ్లు పూర్తి కాగా, మొదటి విడతలో 3,704 మందికి ఇళ్లు కేటాయించారు. రెండో విడతలో 812 మందికి ఇళ్లు కేటాయించారు. ఇప్పటి వరకు అధికారులు 4,516 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు చిన్నవిగా ఉండడం, నాసిరకంగా ఉండడంతో పాటు సుమారు 20 ఏళ్ల పాటు నెలకు సుమారు రూ.2,300 నుంచి రూ.3,200 వరకు చెల్లించాల్సి ఉండడంతో, తాము బ్యాంకుల్లో చెల్లించే మొత్తాలకు పట్టణంలోనే అద్దెకు ఇళ్లు దొరుకుతాయని, కొందరు ఆ ఇళ్లలో చేరే ఆలోచనలను కూడా మానుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదు
అందరికీ ఇళ్లు పథకం కింద నాకు ఇల్లు కేటాయించి దాదాపు 4 నెలలు గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు. అధికారులు మాత్రమే అనేక సార్లు కార్యాలయం, సమావేశాల పేరుతో తిప్పించుకుంటున్నారు. ఇదంతా ఎన్నికల మోసంగానే ఉంది.
– సరస్వతి, చిన్నబజారు
విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు
ఇల్లు కేటాయించారు. కానీ ఇళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాగునీరు, విద్యుత్ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆ ఇళ్లలో ఎలా ఉండాలని తాళం ఇచ్చారో అర్థం కావడం లేదు.
– బాషా, జనార్దన్‌రెడ్డికాలనీ
Comments
Please login to add a commentAdd a comment