సర్కారీ విద్యార్థులూ సూపరే! | government college students also best performance! | Sakshi
Sakshi News home page

సర్కారీ విద్యార్థులూ సూపరే!

Published Sun, May 4 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

సర్కారీ విద్యార్థులూ సూపరే!

సర్కారీ విద్యార్థులూ సూపరే!

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థుల్లో 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 62.43 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 68.21 శాతం మంది పాస్ అయ్యారు. 73 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు మొదటి స్థానంలో నిలువగా, 72 శాతంతో విజయనగరం రెండో స్థానంలో ఉంది. ఇక ఎయిడెడ్ కాలేజీల్లో 53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 62.2 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి తెలిపారు.
 
 ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీల్లో..
 
 ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు(జనరల్) ఇంటర్మీడియెట్‌లో చక్కని ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 14 జూనియర్ కళాశాలల్లో 1,597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,483(93 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని సంస్థ కార్యదర్శి బి.శేషుకుమారి తెలిపారు. 1,175 మంది ఎ-గ్రేడ్, 243 మంది బి-గ్రేడ్, 58 మంది సి-గ్రేడ్, ఏడుగరు డి-గ్రేడ్ సాధించినట్టు వివరించారు. జనరల్ కాలేజీల్లో 98 శాతం మంది, మైనార్టీ కాలేజీల్లో 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. సంస్థ పరిధిలో గరిష్టంగా ఎంపీసీలో 981 మార్కులు(రెడ్డి ప్రవీణ్‌కుమార్, నాగార్జునసాగర్ కాలేజ్), బైపీసీలో 973 మార్కులు(ఎం.చక్రవర్తి, సర్వేల్ కాలేజ్), ఎంఈసీలో 974 మార్కులు(ఎస్.హరీష్, నాగార్జునసాగర్ కాలేజ్), సీఈసీలో 956 మార్కులు(కె.ప్రవీణ్‌కుమార్, నాగార్జునసాగర్ కాలేజ్) సాధించినట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న 60 మంది విద్యార్థులకు గాను 13 మంది ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో అర్హత పొందారని తెలిపారు.
 
 అమ్మో.. ఆంగ్లం!
 
 ఇంగ్లిష్‌లోనే ఎక్కువమంది ఫెయిల్


 
 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఆంగ్ల పరీక్షలోనే ఫెయిలయ్యారు. ఈ పరీక్షకు 9,53,609 మంది హాజరుకాగా, 1,07,874 మంది ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 1,05,672 మంది సివిక్స్‌లో ఫెయిల్ కాగా, కెమిస్ట్రీలో 93,326 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గతేడాది కూడా ఇంగ్లిష్‌లోనే ఎక్కువమంది ఫెయిలయ్యారు.
 
 
 
 
 
 

 

 

జేఈఈ మెయిన్‌కు 13 మంది ‘గురుకుల’ విద్యార్థులు
 
 ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 13 మంది విద్యార్థులు శుక్రవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో అర్హత సాధించారు. సీబీఎస్‌ఈ కటాఫ్ మార్కులను ఈసారి ఓసీలకు 115, ఓబీసీలకు 74, ఎస్టీలకు 47, ఎస్సీలకు 53గా నిర్ణయించింది. వీటిప్రకారం అర్హత సాధించిన వారిలో గురుకుల జూనియర్ కళాశాలలకు చెందిన 13 మంది విద్యార్థులున్నారు. నాగార్జునసాగర్ గురుకులంలో చదువుతున్న ఎం.సాయితేజ 159, తులసిరాములు 120, దినేష్ రిషి 92, నర్సింగరావు 85, భరత్‌కుమార్ 60 మార్కులతో అర్హత సాధించగా.. నిమ్మకూరులో చదువుతున్న తిరుమలరెడ్డి 124, వి.మనోజ్‌కుమార్ 99, సీహెచ్ భాస్కర్ 87, సాయిపవన్ 86, రాజాకృష్ణ 111 మార్కులు సాధించారు. హసన్‌పర్తి ఏపీఆర్ జేసీలో చదువుతున్న ఎల్.స్వాతి, 64, వెంకటగిరిలో చదువుతున్న వెంకటసాయిప్రసాద్ 65, గ్యారంపల్లి కాలేజీలో చదువుతున్న నాగరాజు 60 మార్కులతో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించారు.
 
 కంప్యూటర్ ఇంజినీర్‌గా పేరు తెచ్చుకుంటా
 
 ‘కంప్యూటర్ ఇంజినీర్‌గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకొని తల్లిదండ్రుల కల నిజం చేస్తా’- అని సీనియర్ ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథముడుగా నిలిచిన కేతిని నిఖిల్ బాబు ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. వరంగల్ జిల్లా మంగపేట మండలం నడిగూడెం గ్రామానికి చెందిన కేతిని శ్రీనివాస్, పుష్పవతి దంపతుల కుమారుడు నిఖిల్ బాబు. అమ్మమ్మగారి ఊరైన ఖమ్మం జిల్లా అశ్వాపురం గ్రామంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకొని 9.78 జీపీఏ సాధించాడు. చిన్ననాటి నుంచి మంచి ఇంజినీర్‌గా ఎదగాలనే కోరిక ఉండేదని, దీనిని సాకారం చేసుకుంటాన ని నిఖిల్ తెలిపాడు.
 - కేతిని నిఖిల్‌బాబు (ఎంపీసీ-994)
 
 ప్రఖ్యాత ఇంజినీర్‌గా ఎదుగుతా
 
 ‘మా నాన్న కోటేరు వెంకట్‌రెడ్డి, అమ్మ కృష్ణవేణి. తల్లాడలో మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న చిన్నప్పటి నుంచి ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవాలి అనేవాడు. ఆయన కల నిజం చేయాలనే పట్టుదలతో చదివాను. మంచి మార్కులు సాధించాను’అని కోటేరు ఆషా ‘న్యూస్‌లైన్‌కు చెప్పింది. తల్లాడ యూనివర్సల్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆషా టెన్త్‌లో 9.5జీపీఏ సాధించింది. ఇంజినీర్‌గా ఎదిగి దేశానికి ఉపయోగపడాలన్నదే తన ధ్యేయమని ఆమె చెప్పింది.
 - కోటేరు ఆషా (ఎంపీసీ- 994 మార్కులు)
 
 డాక్టర్‌ను అవుతా..
 
 ఈమె అభిప్రాయం..: స్టేట్ ఫస్ట్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, లెక్చరర్ల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించాను. బాగా చదువుకుని డాక్టర్ అయి పేదలకు సేవలందించాలన్నది నా లక్ష్యం.
 - నాగూరు దివ్య (బైపీసీ 989 మార్కులు)
 
 కార్డియాలజిస్ట్ నవుతా..
 
 ఎంబీబీఎస్ చేసి కార్డియాలిజిస్ట్ కావాలనేదే తన జీవిత లక్ష్యమన్నారు. డాక్టర్ కోర్సు చదివితే ఎంతోమంది పేదలకు సర్వీసు అందించవచ్చన్నారు. అందుకోసం కష్టపడుతానని వివరించారు. పాఠ్యపుస్తకాలను ఇష్టపడి అర్ధం చేసుకుంటూ చదివినందువల్లనే ఫలితం దక్కిందన్నారు.
 - మొదలి రిషిత (బైపీసీ-989 మార్కులు)
 
 సీఏ కావటమే లక్ష్యం
  చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. నాన్న ఐనంపూడి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ నాగరాజకుమారి గృహిణి. పదదో తరగతి చదివి 9. 8 గ్రేడ్ సాధించా. అదే స్పూర్తితో ఇంటర్‌లోనూ చదివి మొదటిర్యాంక్ సాధించా. తల్లిదండ్రులు, అధ్యాపకులు నన్ను చదువులో ఎంతగానో ప్రోత్సహించారు.-ఐనంపూడి సాయిస్పందన (ఎంఈసీ- 984 మార్కులు)

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement