పరిహారం.. ఫలహారం! | government cyclone victims help goods in srikakulam | Sakshi
Sakshi News home page

పరిహారం.. ఫలహారం!

Published Sun, Oct 19 2014 2:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

పరిహారం.. ఫలహారం! - Sakshi

పరిహారం.. ఫలహారం!

సాక్షి, ప్రతినిధి, శ్రీకాకుళం, రిమ్స్‌క్యాంపస్: ఈ ఫోటోలో వ్యక్తిని చూశారా.. వృద్ధురాలికి సాయమందిస్తున్న ఇతన్ని చూసి ఏ రెవెన్యూ అధికారో, మున్సిపల్ అధికారో అను కుంటే పొరపాటే. అలాగని ఉదారంగా తన సొంత ఖర్చు తో సాయం చేస్తున్నారనుకుంటే అంతకంటే తప్పులో కాలేసినట్లే.. ఇంతకీ ఈయనగారెవరు?.. ఈయన చేస్తున్నదేమిటంటే..  శ్రీకాకుళం మున్సిపాలిటీ 33వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి అయిన ఈయన పేరు కరగాన భాస్కరరావు. ప్రభుత్వం తుపాన్ బాధితుల కోసం పంపించిన సరుకులను ఈయన ఇంటి వద్దే.. ఈయన చెప్పిన వారికే పంపిణీ చేస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో బాధితులందరికీ అందుతోందా అంటే.. లేదని ఆ వార్డు ప్రజలే స్పష్టం చేస్తున్నారు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సాయం పంపిణీ తీరు ఇలాగే ఉంది. టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లోనే అంతా జరగుతోంది. బాధితుల్లోనూ పార్టీ భేదం చూస్తున్నారు. అర్హులు కాకపోయినా అధికార పార్టీ కార్యకర్తలు సాయాన్ని భోంచేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు సరుకులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
 అధికార పార్టీ ఆధ్వర్యంలోనే..
  హూదూద్ తుపాను బాధితులకు ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతోంది. బాధితులకు భోజన పొట్లాలతోపాటు బియ్యం, పప్పులు, ఉప్పు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పక్కదారి పట్టిస్తూ బాధితులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు. పేరుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నా అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే సాగుతోంది. ఇందులోనూ రాజకీయం జరుగుతోంది. జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు మున్సిపల్ వార్డుల్లో సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చాయి. అయినా ఇప్పుడు వారికే తుపాను, వరద బాధితులకు అందిస్తున్న సహాయాన్ని పంపిణీ చేసే బాధ్యత కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది.
   
 సరుకుల సరఫరా అంతంత మాత్రమే...
 బియ్యం, పప్పు, వాటర్, పాల ప్యాకెట్ల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. వార్డులకు, గ్రామాలకు వచ్చిన సరుకులను టీడీపీ నేతల ఇళ్లకు చేర్చి, వారి ఇష్టం వచ్చినట్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా అసలైన బాధితులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. టీడీపీ సానుభూతిపరులకే ఎక్కవగా అందుతోంది. ముఖ్యంగా మహిళా పొదుపు సంఘాల సానుభూతి పొందాలన్న ఉద్దేశంతో బాధితులు కాకపోయినప్పటికీ వారికే సరుకులు అందజేస్తున్నారు. నాగావళి వరదతో జలదిగ్బంధంలో చిక్కుకున్న తమకు ఏమాత్రం సాయం అందలేదని శ్రీకాకుళం పట్టణంలోని తురాయి చెట్టు వీధి బాధితులు  ఆవేదన చెందుతున్నారు.33వ వార్డు అయ్యప్ప కాలనీ వాసులదీ ఇదే అనుభవం. శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట, తుమ్మావీధి, హడ్కోకాలనీ, అయ్యప్పకాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, డ్వాక్రా సంఘాలు తమ వారికే సరుకులు పంపిణీ చేస్తున్నారు. కంపోస్ట్ కాలనీలో లక్ష్మీ రాజ్యం అనే కార్యకర్త తనకు నచ్చిన వారికే సరుకులు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  మున్సిపల్ కార్యాలయాలకు వచ్చిన సరుకులను పలువురు టీడీపీ నాయకులు తమ వెంట తీసుకుపోయి తమ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ హంగామా చేస్తున్నారు.
 
 బ్లాక్ మార్కెట్‌లో పాల ప్యాకెట్లు
 బాధితుల కోసం అధికారులు సరఫరా చేయాల్సిన పాల ప్యాకెట్లలో సగానికి పైగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. బాధితులకు అందించాల్సిన పాల ప్యాకెట్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు లెక్కకు మించి ఇచ్చేస్తుండగా వారు ఆ ప్యాకెట్లను టీ దుకాణాలు, హోటళ్లకు ప్యాకెట్ రూ.15 చొప్పున అమ్ముతున్నారు. అలాగే వాటర్ ప్యాకెట్ బస్తాలను కూడా బయటకు తరలించి రూ.50 రేటుకు అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల 25 కేజీల బియ్యానికి బదులు పది కేజీలే ఇస్తున్నారు, స్వచ్చంద సంస్థలు అందజేసిన సరుకులు కూడా నాయకులు చెప్పిన చోటకే వెళ్తున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా అధికార పార్టీ కార్యకర్తలైనందున ఏమీ అనలేక మౌనం వహిస్తున్నారు.
 
 కమిటీలు సూచించిన వారికేనా?
 బాధితులందరినీ ఒకేలా చూడాలి. అందరికీ పరిహారం అందాలి. కానీ చాలా చోట్ల ఇలా జరగడం లేదు.  తుపాను నేపథ్యంలో పనికి వెళ్లనివారికి సాయం కింద ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికీ అర్హులను గుర్తించలేకపోయారు. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ప్రాంతాల నుంచి వస్తున్న సరుకుల్ని సకాలంలో పంపిణీ చేయాలి. కానీ నేతలు సూచించినవారికే సరుకులు అందించాలని భావించడంతో అవి కుళ్లిపోతున్నాయి. ఎవరి ద్వారా ఎంత సరుకొస్తోంది అన్న విషయంలో కూడా స్పష్టత కరువైంది. మూడు నాలుగు రోజుల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నామని నేతలు చెబుతున్నా పూర్తిస్థాయిలో బాధితులకు మాత్రం అందడం లేదు. ఇదేంటని నేతల్ని ప్రశ్నిస్తున్నా ‘మాకొచ్చిన సరుకుల్లో ఎవరు ముందొస్తే వారికిచ్చేస్తున్నాం, పూర్తిస్థాయిలో రాకపోవడంతో అక్కడక్కడ ఇలా జరుగుతోంద’ని చెప్పుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement