సర్కారు పరువుపోవడం ఖాయం
పాతగుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయకుంటే సర్కారు పరువు పోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలు చేయాలని మంగళవారం గుంటూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు వచ్చాయని, వర్షాలు పడుతున్నయని రైతులు సాగు చేస్తున్న నేపథ్యంలో పంట రుణాలు అందక, రీషెడ్యూల్ కాక అన్నదాతలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరువు పోకముందే కళ్ళు తెరవాలని సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలురైతులున్నారని, రీషెడ్యూల్ ఆలస్యం కావటంతో రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నరిశెట్టి గురవయ్య మాట్లాడుతూ రుణాల రద్దు, రీషెడ్యూల్ కాకుంటే రైతులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. స్వయాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే రూ.30 లక్షల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారని చెప్పారు. నకిలీల బెడదను అటకట్టాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులలో ఉన్న రూ.9 వేల కోట్ల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను రెట్టింపు చేయడానికి కంకణం కట్టుకోవటం శోచనీయమని విమర్శించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బ్యాంకు కార్యనిర్వాహణాధికారి ఎం మురళీకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పచ్చల సాంబశివరావు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, కోటేశ్వరరావు, రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.