యువతకు ఊతం ఇవ్వాల్సింది ప్రభుత్వమే
విజయవాడ, న్యూస్‌లైన్ :
ఉన్నత విద్య పూర్తిచేసిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్.మాన్తా అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం హోటల్ గేట్‌వేలో ‘ది రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు ఇంజినీరింగ్, ఉన్నత విద్య కళాశాలలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
మాన్తా మాట్లాడుతూ.. టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు త గినట్లుగా స్కిల్స్ కలిగి ఉండటం లేదనడం సరికాద న్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ కాకుండా ఇతర కోర్సులు చదువుతున్నవారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిలో 20 శాతం మందికి కూడా ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు లభించడం లేదని, ప్రయివేటు సెక్టార్‌లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తెలిపారు. పబ్లిక్ సెక్టార్‌లో అధికశాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎండీ, సీఐఐ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్యానల్ రాష్ట్ర కన్వీనర్ డి.రామకృష్ణ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యనభ్యసిస్తున్న వారిలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ఉండటం లేదన్నారు.
విద్యార్థి ఎంచుకున్న కోర్సును బట్టి పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా కళాశాలలు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. థియరీతో పాటు, ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ అనే అంశంపై ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ వైస్‌చైర్మన్ సతీష్‌రెడ్డి, డేటా ప్రైవసీ అండ్ అసోసియేటెడ్ రిస్క్స్ ఆన్ అకౌంటెంట్ ఆఫ్ నాన్ జెన్యూన్ సాప్ట్‌వేర్ అనే అంశంపై ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీ తలశిత, మైక్రోసాఫ్ట్ ప్ట్ ఇండియా డెరైక్టర్ అనీల్ వర్జీస్ తదితరులు ప్రసంగించారు. సమావేశానికి సీఐఐ నగర చైర్మన్ వీవీఎం.కృష్ణ అధ్యక్షత వహించారు.