బిల్లుల్లో ప్రభుత్వ ఉద్దేశం తెలియాలి : సీఎం జగన్‌ | Government Intention Over Bills Should Be Clear Says CM Jagan | Sakshi
Sakshi News home page

బిల్లుల్లో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా తెలియాలి : సీఎం జగన్‌

Published Tue, Jul 9 2019 10:37 PM | Last Updated on Tue, Jul 9 2019 10:41 PM

Government Intention Over Bills Should Be Clear Says CM Jagan - Sakshi

రూపొందించే ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాలు వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటిపై జరిగిన కసరత్తును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం అధికారులతో సమీక్షించారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణలకోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో సమావేశమయ్యారు. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందనున్నాయి. రూపొందించే ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాలు వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

14 నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో..  అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు ఫీజులను కట్టడిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటినుంచి వైఎస్‌ జగన్‌ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో స్కూలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఒక చట్టం చేయబోతున్నారు. దీనికోసం తయారుచేసిన బిల్లుపై అధికారులతో సీఎం వివరంగా మాట్లాడారు. అలాగే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా మరొక చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. 

కౌలు రైతులకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యంలో రైతు భరోసాను వారికి అందిస్తామని ఇదివరకే ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. దీనిలో భాగంగా భూయజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పంటపై 11 నెలలపాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ముసాయిదా బిల్లుపై కూడా సీఎం అధికారులతో సమీక్షించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, నామినేటెడ్‌ పోస్టుల్లో యాభైశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందేలా ఉద్దేశించిన బిల్లునూ ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆయా వర్గాలకు ఈ చట్టంద్వారా పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యత కల్పించబోతున్నామని ఆయన ఇదివరకే స్పష్టంచేశారు. వీటితోపాటు మరికొన్ని బిల్లులపై కూడా సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement