మనదేనయ్యా ఆ భూమి.. | Government Land Find in East Godavari | Sakshi
Sakshi News home page

మనదేనయ్యా ఆ భూమి..

Published Wed, Jun 3 2020 12:10 PM | Last Updated on Wed, Jun 3 2020 12:10 PM

Government Land Find in East Godavari - Sakshi

పేదలకు ఇళ్ల స్థలాలుగా అందించనున్న ప్రభుత్వ భూమి

తూర్పుగోదావరి, రామచంద్రపురం: వెతుకుతున్న వస్తువు కాలికి తగిలినట్టు.. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూమి కోసం అన్వేషిస్తుంటే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి అధికారుల కంట పడింది.. అసలు ఆ భూమి ఎవరిదని ఆరా తీస్తే... ప్రభుత్వానిదే అని నిర్ధారణ అయింది. చివరికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చొరవతో ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన సుమారు 2.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్‌ 99, 100లో ఈ భూమి వెల్ల సావరం దగ్గర్లో ఉంటుంది. ద్రాక్షారామ రెవెన్యూ పరిధిలోని ఆ మెరక భూమిలో 40 ఏళ్ల నుంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ ఫలాలను కొందరు అనుభవిస్తున్నారు. ఆ స్థలం సర్కారుదని ఎవరికీ తెలియదు. అంతేకాకుండా కొంత ఆక్రమణకు గురైంది.

ఇదిలా ఉంటే పేదలందరికీ గూడు కల్పించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్థలాలున్నాయో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పట్టారు. అధికారులకు ద్రాక్షారామ పరిధిలోని ఆ భూమి కనిపించింది. అసలు ఎవరిదని అధికారులు రికార్డులు తిరగేశారు. చివరికి ప్రభుత్వానిదే అని తేలింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన ఆయా సర్వే నంబర్లలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 2.70 ఎకరాల భూమిని స్వా«ధీనం చేసుకున్నారు. పొక్లెయిన్‌తో చెట్లను తొలగించి చదును చేశారు. ద్రాక్షారామ పరిధిలోని ఇళ్లు లేని పేదలకు స్థలాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ఎంతో శ్రమపడ్డారు. అనుకోకుండా విలువైన భూమిని గుర్తించి దానిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో సుమారు 135 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. ఈ స్థలాన్ని గుర్తించడంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పేదలకు మేలు జరగనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మా కంట పడింది..
గతంలో ఆ భూమిని ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం సర్వే చేస్తుండగా మా కంట పడింది. ఎవరిదని ఆరా తీస్తే ప్రభుత్వానిదని తేలింది. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నారు. ఆ స్థలాన్ని పూర్తిగా సిద్ధం చేశాం. పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తాం.– పి.తేజేశ్వరరావు, తహసీల్దార్,రామచంద్రపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement