చిత్తశుద్ధి ఏదీ ? | government most prestigious authorities | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి ఏదీ ?

Published Sun, Aug 4 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:37 PM

government most prestigious authorities

నల్లగొండ, న్యూస్‌లైన్: నల్లగొండ పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి కరువైంది. పట్టణంలో రూ.56.79కోట్లు వెచ్చించి చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. ఓ వైపు నాణ్యతాలోపాలకు నిలువుటద్దంగా నిలుస్తుండగా, మరోవైపు నిధులు లేమితో చివరాంతం పనులు జరగక గుంతలు తేలిన మట్టిరోడ్లు వెక్కిరిస్తున్నాయి.
 
 నానాటికీ పెరిగిపోతున్న నల్లగొండ పట్టణ జనాభాకనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యుఐడీఎస్‌ఎస్‌ఎంటీ పథకం కింద రూ.56.79కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పథకాన్ని మంజూరు చేయించారు. పనులు దాదా పు తుది దశకు చేరుకున్నప్పటికీ గడిచిన కొంతకాలంగా స్తబ్దత నెలకొంది. నల్లగొండ మున్సిపాలిటీలో గత మార్చి31 చివరాంతం నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసి నా పనులు మాత్రం పూరిస్థాయిలో జరగలేదు.
 
 శాశ్వత పరిష్కారం దిశగా...
 నల్లగొండ పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, అధ్వానంగా ఉన్న వ్యవస్థీకృత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం 80 శాతం వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం, మున్సిపాలిటీ మరో పది శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులను వెంటనే విడుదల చేయించి వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభించారు.
 
 నల్లగొండలో పథకాన్ని ప్రారంభించి 18నెలల కాలంలో పూర్తి చేసేందుకు 2009 ఫిబ్రవరిలో సదరు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  అప్పటి నుంచి 2010 సెప్టెంబర్ మాసంలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా పలు కారణాలతో గడువులు పెంచుతూ 2012 మార్చి నాటికి తుది గడువు విధించారు. అయినా  ఇప్పటికీ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 205.08కి.మీకు గాను 194.12 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి.  ఇంకా 10.96కి.మీ పూర్తికావాల్సి ఉంది. ప్రధానమైన శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక మ్యాన్‌హోల్స్ మొత్తం 7875 గాను 7730 మాత్రమే నిర్మించగా 145 మ్యాన్‌మోల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అదే విధంగా  సైడ్‌చాంబర్స్ 18వేలకు గాను 17వేల 738 పూర్తయ్యాయి.  
 శుద్ధికేంద్రాల ఏర్పాటుకు చొరవ ఏదీ..?
 అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి తుదిదశ అయినటువంటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు మాత్రం ఇప్పట్లో పరిష్కారం లభించేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు భూ సమస్య ప్రధాన కారణం కాగా పరిష్కారానికి చొరవచూపే వారే కరువయ్యా రు. ప్రభుత్వం నిధులు కేటాయింపుకు ససేమిరా అనడం, చివరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు చేయడం వరకు వెళ్లింది.
 
 పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్..
 పట్టణంలో నిర్మించిన మ్యాన్‌హోల్స్ మురుగునీటితో పొంగిపొర్లుతున్నాయి. కాంట్రాక్టర్ గృహాలకు అనుసంధానం చేయకపోవడంతో ప్రజలు స్వయంగా  కనెక్షన్లు  కలుపుకున్నారు. దీంతో మ్యాన్‌హాల్స్ మొత్తం ఇళ్లలోని మురికినీటితో నిండి భయానకంగా తయారయ్యాయి.
 
 పస్తుతం వర్షాకాలం సీజన్ రావడంతో మురికినీటికి వర్షంనీరు తోడుకావడంతో పట్టణంలోని గంధవారిగూడెం, చైతన్యపురి కాలనీ, డీఈఓ కార్యాలయం ఎదురుగా, బోయవాడ స్కూల్ ఎదుట, సావర్కర్‌నగర్, ఎస్‌ఎల్‌ఎన్ స్వామి కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర  ప్రాంతాల్లో పొంగిపొర్లుతూ రోడ్లపై ప్రవహిస్తున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసి మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టకపోతే అండర్‌గ్రౌండ్ పైపు లు, మ్యాన్‌హోల్స్ ఎక్కడికక్కడ పగిలి రూ.56 కోట్ల నిధులు నిష్ఫలమయ్యే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
 
 ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అండర్‌గ్రౌండ్ అసంపూర్తి
 నల్లగొండ పట్టణం లో ప్రజాప్రయోజనం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అం డర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను చేపట్టిన ప్రభుత్వం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైప్‌లైన్, మ్యాన్‌హోల్ తదితర వ్యవస్థలు పూర్తయి ఏడాదిన్నర గడిచినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్‌హోల్స్‌లకు అనధికారికంగా ప్రజలే కనెక్షన్లు కలుపుకోవడంతో నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. దీంతో పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
 - చెనగోని భిక్షం, శాస్త్రినగర్, నల్లగొండ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement