under ground driange
-
మ్యాన్‌హోల్ మింగేసింది..
బతుకుదెరువు చావు కోరుతోంది.. నిర్లక్ష్యం ప్రాణంతో ఆడుకుంటోంది.. డ్రెయినేజీ డేంజర్ అయింది.. పనులకు కోసం దిగితే మింగేస్తోంది.. ప్రతిసారి ఇదే తంతు.. నగరంలో మురుగుకాలువ పనులు ప్రమాదకంగా మారాయి.. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీలో దిగితే అడ్రస్ గల్లంతు అన్నట్లుతయారైంది.. బతుకుపోరాటంలోకష్టమని తెలిసిన పనికి వెళ్లిన అభాగ్యుడు కనిపించడం లేదు.. ఈ ఘటన సింగ్‌నగర్ ఎక్సెల్‌ప్లాంట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్‌హోల్ ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన గుంజా గంగరాజు(37) ఫ్లంబర్ లైసెన్స్‌తో డ్రెయినేజీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాలలో యూజీడీ ఇంటర్ కనెక్షన్లు ఇస్తున్నారు. వాంబేకాలనీ వైపునకు వెళ్లే ప్రధాన లైన్లో మురుగు నిలిచిపోయింది. దీంతో ఎక్సెల్‌ప్లాంట్ వెంబడి ఉన్న మ్యాన్‌హోల్ వద్ద డమ్మీ తొలగించాల్సి వచ్చింది. కష్టమైన పనికి ఒప్పుకుని.. కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టు కార్మికులను పిలిచి చూపగా అందులోకి దిగడానికి ఎవరూ సాహసం చేయలేదు. గంగరాజు తనతో పాటు మరో నలుగురు కార్మికులతో కలసి పనికి ఒప్పకున్నాడు. మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో దిగి డమ్మీ తీసేందుకు ప్రయత్నించాడు. డమ్మీ మూత ఎంతసేపటికి రాకపోవడంతో గంగరాజు మూతను గట్టిగా లాగిపట్టుకున్నాడు. డమ్మీ ఊడిపోవడంతో మురుగునీరు ఒక్కసారిగా ముందుకు నెట్టింది. దీంతో వాటిని తప్పించుకుని నిచ్చెన సాయంతో పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి, ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అతడితో పాటు వెళ్లిన కార్మికులు చెబుతున్నారు. ముమ్మరంగా గాలింపు చర్యలు.. మ్యాన్‌హోల్‌లో పనులకు దిగిన గంగరాజు ఆచూకీ కోసం అగ్నిమాపకశాఖ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రధానంగా ఎక్స్‌ల్‌ప్లాంట్ వద్ద చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. ఏడాది కిందట ఇలాగే.. గత ఏడాది మార్చి 14వ తేదీ భవానీపురం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇదే విధంగా ఇద్దరు కార్మికులు డ్రెయినేజీలో పడి మృత్యువాతపడ్డారు. మళ్లీ ఏడాదికి ఈ ఘటన జరగడంతో ప్లంబర్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మూడు వేలు వస్తాయని వెళ్లాడు.. ఇల్లు జరగడం కష్టంగా ఉంది.. ఈ పనికి వెళ్లొస్తే రూ.3 వేలు వస్తాయని చెప్పి వెళ్లిన నా భర్త ఇలా ఆపదలో చిక్కుకుంటాడని ఊహించలేదంటూ గంగరాజు భార్య భధ్రమ్మ రోదిస్తోంది. గంగరాజు దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు ముగ్గురు స్థానిక వివేకానంద స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. పెద్ద కూతురు దేవి 8వ తరగతి, కొడుకు జ్యోతిప్రసాద్ 6వ తరగతి, రెండో కూతురు మీనాక్షి 5వ తరగతి చదువుతున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్లంబర్ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లోకి కార్మికులను పంపకూడదని, కనీస భద్రత సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇలా కార్మికుల జీవితాలను బలికొంటూ వారి కుటుంబాలను అంధకారంలోకి ప్రభుత్వమే నిర్లక్ష్యంతో నెట్టివేస్తోందని ఆరోపించారు. మృతదేహం లభ్యం మ్యాన్‌హోల్‌లో గల్లంతు అయిన గంగరాజు కోసం రాత్రి సమయంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రెయినేజీ పెద్దదిగా ఉండడంతో ప్రాణాలతో ఉండి ఉండవచ్చునని ఆశతో చర్యలు చేపట్టారు. కాని చివరికి మృతదేహం లభ్య కావడంతో బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. -
అడ్డగోలు డ్రెయినేజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా భూగర్భ డ్రెయినేజీ వచ్చిందంటే మురుగు నీటి కష్టాలు తప్పుతాయి. కానీ జిల్లాలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. డ్రెయినేజీ వేసిన తర్వాత దాని అవుట్లెట్లు అన్నీ ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేయాలి. అయితే జిల్లాలో అటువంటి ప్రతిపాదనలే లేకుండా పనులు జరిగిపోయాయి. కేవలం భూగర్భ డ్రెయినేజీ పైపులు వేసి వాటి అవుట్లెట్లను ఊరి చివర పంట బోదెలు, ఉర్లో ఉన్న చెరువులకు కలిపి వదిలేశారు. మరికొన్ని చోట్ల ఆయా రోడ్ల చివరి వరకూ పైపులు వేసి అక్కడ చిన్న గుంట తీసి అందులోకి నీరు వదిలిపెట్టేశారు. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు కూడా చేసేసుకున్నారు. మా పని అయిపోయింది.. మీ కష్టాలు మీరు వేసినా నిధులు మంజూరు చేశారు. కొన్ని గ్రామాల్లో కనీసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవుట్ లెట్ లేకుండా పనులు చూపించి నిధులు మంజూరు చేయించుకున్నారు. ‘సాక్షి’లో సోమవారం ‘అండర్‌గ్రౌండ్ రాజు’ శీర్షికన భూగర్భ డ్రెయినేజీ పనుల్లో జరిగిన అవకతవకలపై కథనం రావడంతో జిల్లాపరిషత్ ౖచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పందించారు. తన వివరణ తీసుకోకుండా వార్త ఎలా రాస్తారంటూ ‘సాక్షి’పై చిర్రుబుర్రులాడారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే భూగర్భ డ్రెయినేజీ పేరుతో పంట కాలువలను, చెరువులను కలుషితం చేయడం, వీధి చివర అవుట్లెట్లను వదిలివేయడంపై ఆయన స్పందించలేదు. పట్టించుకోని నిబంధనలు : గ్రామాల్లో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థకు ప్రతి ఇంటినుంచి వచ్చే మురుగునీరు అనుసంధానమై ఉండాలి. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని ఎత్తుపల్లాలు లేకుండా భూగర్భంలో మురుగునీరు పల్లపు ప్రాంతం వైపు సజావుగా సాగేలా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఒక్కో గ్రామంలో నాలుగైదు వైపులకు నీరు వెళ్లేలా పనులు చేసి మమ అనిపించారు. కింద కాంక్రీట్ బెడ్ వేయకుండా రెండు ఇటుక రాళ్లను పెట్టి మధ్యలో పైపులను అమర్చి లైన్లు వేసేశారు. భవిష్యత్‌లో మధ్యలో పైపులు కుంగిపోతే డ్రెయినేజీ నీరు ముందుకు పారే అవకాశం ఉండదు. అంతేకాక ప్రతి ఇంటి నుంచి మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండానే డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. పనులకు ఉపయోగించిన తూరల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవువుతున్నాయి. భూగర్భ డ్రెయినేజీ అవుట్లెట్లను చెరువుల్లో పంట బోదెల్లో కలపడం వల్ల తాగునీరు, సాగునీరు కలుషితం అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
అండర్‌గ్రౌండ్ రాజు
భూగర్భ(అండర్‌గ్రౌండ్) డ్రెయినేజీ పనుల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. తూరల సరఫరా, బినామీ కాంట్రాక్టులతో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. నల్లజర్లకు చెందిన ఈ ముఖ్య ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఎంచక్కా జేబు నింపుకుంటున్నారు. ఆ కథాకమామిషు.. టాస్క్‌ఫోర్స్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టారు. 70 శాతం ఉపాధి హామీ, 20 శాతం జెడ్పీ, 10 శాతం పంచాయతీ నిధులతో ఈ పనులు చేపట్టారు. కొన్నిచోట్ల పంచాయతీ వాటా భరించలేకపోతే దాతల ద్వారా సమకూరుస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగానికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ‘తూతూర’మంత్రంగా నల్లజర్లకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సొంత మండలం నల్లజర్లలోనే 23 గ్రామాల్లో ఏకంగా రూ.35 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. తొలుత 11 స్మార్ట్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదని సమాచారం. ఉపాధి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా.. పొక్లెయిన్లతోనే కాలువలు తవ్వించారు. జాబ్ కార్డులూ టీడీపీ కార్యకర్తల పేరుతో ఇప్పించి పనులు చేసిన తర్వాత వాళ్ల ఖాతాల్లో సొమ్ములను వెనక్కి తీసుకుంటున్నారు. ఒక్కో కిలోమీటరు భూగర్భ డ్రెయినేజీకి అవసరమైన తూరలకు రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క నల్లజర్ల మండలంలో సుమారు 120 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ పనులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు రూ.17 కోట్ల నుంచి రూ.18 కోట్ల మేరకు తూరల కోసం వెచ్చించినట్టు సమాచారం. ఇక తాడేపల్లిగూడెం, దేవరపల్లి, ద్వారకాతిరుమలతోపాటు మిగిలిన మండలాలకూ తూరలను ఈ ప్రజాప్రతిని«ధే సరఫరా చేశారు. ఈ తూరల నాణ్యత అంతంత మాత్రమేనని సమాచారం. ప్రజా ప్రతినిధి కావడంతో అధికారులూ నోరుమెదపట్లేదు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు భూగర్భ డ్రెయినేజీ పనులన్నీ ఈ ప్రజాప్రతినిధి బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్నారు. జగన్నాథపురం గ్రామాన్ని ఆయన సోదరుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ రూ.84.90 లక్షల విలువైన 9 పనులను ఆయనే బినామీ పేర్లతో చేపట్టారు. పుల్లలపాడులో రూ.60 లక్షల విలువైన పనులను అనుచరుడైన నామినేటేడ్ పదవిలో ఉన్న ఓ యువ నాయకుడు, స్థానిక ప్రజాప్రతినిధి చేశారు. నల్లజర్లలో పనులను నలుగురు టీడీపీ నేతలకు అప్పగించారు. ఇక్కడ రూ.2కోట్ల 94 లక్షల 50వేలతో 30 పనులు చేపట్టారు. మాజీ ప్రజాప్రతినిధికి ఐదు వార్డుల్లో పనులు అప్పగించారు. మరో ముగ్గురు స్థానిక ప్రజాప్రతినిధులకు మిగిలిన పనులు అప్పగించారు. గత ఎన్నికల్లో సహకరించడం వల్లే వారికి అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల్లో రూ.4.39 కోట్లు విలువైన చేపట్టారు. దాదాపు ఇవి పూర్తయ్యాయి. అయితే నాణ్యత అంతంతే. పడమర చోడవరంలో రూ.52.10 లక్షల పనులు జరగ్గా, స్థానిక ప్రజా ప్రతినిధికి 20 శాతం వాటా ఇచ్చి 80 శాతం ముఖ్యప్రజాప్రతినిధికి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అనంతపల్లి రూ.2 కోట్ల 75లక్షల 70 వేలు విలువైన పనులను స్థానిక మండల ప్రజాప్రతినిధి చేపట్టారు. గత ఎన్నికల్లో ఈయన ముఖ్య ప్రజాప్రతినిధికి రూ.60 లక్షలు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. మారేళ్లమూడిలో రూ.85 లక్షల పనులు చేపట్టారు. ఇక్కడ ప్రజా ప్రతినిధి భర్తను అడ్డుపెట్టుకుని ముఖ్య ప్రజాప్రతినిధి స్వయంగా పనులు చేయిస్తున్నారు. శింగరాజుపాలెం రూ.1.35 లక్షల విలువైన పనులను ఓ ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేస్తున్నారు. తిమ్మన్నపాలెంలో రూ.25 లక్షలతో చేపట్టిన పనులను నల్లజర్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ద్వారా చేయించారు. అచ్చన్నపాలెంలో రూ.54 లక్షల 50 వేలు స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా కౌలూరులో రూ.59.40 లక్షల పనులను స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేయిస్తున్నారు. పోతవరంలో రూ.3 కోట్ల విలువైన పనులను ముఖ్య ప్రజాప్రతినిధి సన్నిహితుడు చేపట్టారు. పట్టించుకోని నిబంధనలు నల్లజర్ల మండలంలో చేపట్టిన డ్రెయినేజీ పనులను చూస్తే నిబంధనలు పాటించలేదని స్పష్టమవుతోంది. ప్రధాన డ్రెయిన్ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. కాంక్రీటు వేయకుండానే కేవలం ఇసుక వేసి దిమ్మెలు కట్టి పైపులు అమర్చారు. మురుగునీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయలేదు. సిమెంటు రోడ్లను ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నారు. నల్లజర్ల గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ అవుట్లెట్లను శివారున ఉన్న నల్ల, ఎర్ర చెరువులకు కలిపారు. ఇవి కలుషితమయ్యే దుస్థితి నెలకొంది. అయ్యవారి తూరలే..! డ్రెయినేజీ పనులకు సరఫరా చేసేందుకు ముఖ్య ప్రజాప్రతిని«ధి బినామీ పేర్లతో రెండు తూరల కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సరఫరా అవుతున్న తూరల నాణ్యత అంతంతే. దీనికి జిల్లా ఉన్నతాధికారి ప్రోత్సాహం ఉందని సమాచారం. ఇబ్బందులే ఎక్కువ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టిన గ్రామాల్లో మురుగునీరు సరిగా పారడం లేదు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో సుమారు రూ.4 కోట్లతో డ్రెయినేజీ పనులు చేపట్టారు. ఇక్కడ మురుగునీరు పారక స్థానికులు ఇబ్బందులు పడుతున్నా రు. మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయి. రోడ్లపై నీరు పారుతోంది. వసూళ్ల దందా ఈ ప్రజాప్రతినిధి వసూళ్ల దందా కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల నల్లజర్లలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు దాతల నుంచి చందాలు వసూలు చేసి రూ. పదిలక్షల మేర మిగుల్చుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం మండలంలో ఓ గ్రామంలో బస్‌షెల్టర్ కోసమని నల్లజర్లలో సంక్రాంతి కోడి పందేల నిర్వహణకు రూ.6 లక్షలకు వేలం పెట్టినట్టు సమాచారం. -
కేబుల్..గోల్మాల్
ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అనుమతికి మించి రోడ్ల కటింగ్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నరకం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కరీంనగర్ ప్రజలకు రిలయన్స్ తవ్వకాలు పులిమీద పుట్రలా మారాయి. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాల కోసం 36 కిలోమీటర్లకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్.. ఏకంగా 150 కిలోమీటర్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనివల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు నగరంలో కొత్తగా వేస్తున్న రోడ్లు ఛిద్రమవుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు మిలాఖత్ అయితే ఎలా ఉంటుందో ఈ పనులను చూస్తే తెలిసిపోతుంది. అనుమతి ఇందుకు.. నగరంలో రిలయన్స్ కంపెనీకి చెందిన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేయడానికి నగరపాలకసంస్థ గత సంవత్సరం అక్టోబర్ 22న సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26 కిలోమీటర్ల మట్టిరోడ్డు, రెండున్నర కిలోమీటర్ల సీసీ రోడ్డు, ఎనిమిది కిలోమీటర్ల బీటీ రోడ్డు తవ్వి కేబుల్ వేయడానికి చార్జీల కింద రూ.2.25 కోట్లు కట్టించుకొని 11 షరతులతో కమిషనర్ అనుమతిని మంజూరు చేశారు. నిబంధనలివీ.. రోడ్లను ఎక్కడ తవ్వుతున్నారో కార్పొరేషన్ ఏఈకి తెలియచేయాలి. రోడ్డు తవ్విన చోట వెంటనే రీఫిల్లింగ్ చేయాలి. తవ్వే ప్రదేశం చుట్టూ బారికేడ్లు వేయాలి. డీఈ సమక్షంలో మరమ్మతు పనులు చేపట్టాలి. వ్యక్తికి ప్రాణనష్టం జరిగితే కంపెనీ బాధ్యత వహించాలి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసు ఇవ్వకుండానే నగరపాలకసంస్థకు పనులు నిలిపివేసే అధికారం ఉంది. రోడ్డు కటింగ్ సమయంలో మంచినీటి, యూజీడీ పైప్లైన్లు పగిలితే కంపెనీదే బాధ్యత. అనుమతి రద్దు... మళ్లీ పునరుద్ధరణ రిలయన్స్ తవ్వకాలపై పలువురు మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ గత సంవత్సరం నవంబర్ 8న నగరపాలకసంస్థ కమిషనర్ ఎంసీకే/575/2013-14, తేదీ 08-11-2013 ద్వారా అనుమతి రద్దు చేశారు. అనంతరం డిసెంబర్ 4న ఎంసీకే/3755/2013-14, తేదీ 04-12-2013 ద్వారా అనుమతిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. రిలయన్స్ జేఐఓ నిబంధనలు పాటిస్తానని చెప్పడంతో, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి మౌఖిక ఆదేశాల మేరకు అనుమతిని పునరుద్ధరించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని రద్దు చేసినా, మళ్లీ ఎందుకు పునరుద్ధరించారనే ప్రశ్నకు సమాధానం లేదు. లెక్కల్లేవు.. రిలయన్స్ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి... ఎన్ని కిలోమీటర్లు తవ్వుతున్నారనే సమాచారం నగరపాలకసంస్థ వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పనులపై కాంట్రాక్టర్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడంతోనే లెక్కకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. అనుమతి మీరి తవ్వకాలు రూ.15 కోట్లు ఎగవేత.. కాంట్రాక్టర్ అనుమతి మీరి తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ డివిజన్లలో 150 కిలోమీటర్లకు పైగా రోడ్లను తవ్వినట్లు మాజీ కార్పొరేటర్లు చెబుతున్నారు. 36 కిలోమీటర్ల మేర తవ్వడానికి నగరపాలక సంస్థకు రూ.2.25 కోట్లు చెల్లించగా, 150 కిలోమీటర్లు తవ్వి సుమారు రు.15 కోట్లు ఎగవేశాడంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు కావడం వల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, విచారణ నిర్వహిస్తే నిజాలు వెల్లడవుతాయని అంటున్నారు. అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ నిర్వహించి నగరపాలకసంస్థ ఆదాయం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. -
చిత్తశుద్ధి ఏదీ ?
నల్లగొండ, న్యూస్‌లైన్: నల్లగొండ పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి కరువైంది. పట్టణంలో రూ.56.79కోట్లు వెచ్చించి చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. ఓ వైపు నాణ్యతాలోపాలకు నిలువుటద్దంగా నిలుస్తుండగా, మరోవైపు నిధులు లేమితో చివరాంతం పనులు జరగక గుంతలు తేలిన మట్టిరోడ్లు వెక్కిరిస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న నల్లగొండ పట్టణ జనాభాకనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యుఐడీఎస్ఎస్ఎంటీ పథకం కింద రూ.56.79కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పథకాన్ని మంజూరు చేయించారు. పనులు దాదా పు తుది దశకు చేరుకున్నప్పటికీ గడిచిన కొంతకాలంగా స్తబ్దత నెలకొంది. నల్లగొండ మున్సిపాలిటీలో గత మార్చి31 చివరాంతం నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసి నా పనులు మాత్రం పూరిస్థాయిలో జరగలేదు. శాశ్వత పరిష్కారం దిశగా... నల్లగొండ పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, అధ్వానంగా ఉన్న వ్యవస్థీకృత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం 80 శాతం వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం, మున్సిపాలిటీ మరో పది శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులను వెంటనే విడుదల చేయించి వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభించారు. నల్లగొండలో పథకాన్ని ప్రారంభించి 18నెలల కాలంలో పూర్తి చేసేందుకు 2009 ఫిబ్రవరిలో సదరు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి 2010 సెప్టెంబర్ మాసంలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా పలు కారణాలతో గడువులు పెంచుతూ 2012 మార్చి నాటికి తుది గడువు విధించారు. అయినా ఇప్పటికీ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 205.08కి.మీకు గాను 194.12 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా 10.96కి.మీ పూర్తికావాల్సి ఉంది. ప్రధానమైన శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక మ్యాన్‌హోల్స్ మొత్తం 7875 గాను 7730 మాత్రమే నిర్మించగా 145 మ్యాన్మోల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అదే విధంగా సైడ్చాంబర్స్ 18వేలకు గాను 17వేల 738 పూర్తయ్యాయి. శుద్ధికేంద్రాల ఏర్పాటుకు చొరవ ఏదీ..? అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి తుదిదశ అయినటువంటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు మాత్రం ఇప్పట్లో పరిష్కారం లభించేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు భూ సమస్య ప్రధాన కారణం కాగా పరిష్కారానికి చొరవచూపే వారే కరువయ్యా రు. ప్రభుత్వం నిధులు కేటాయింపుకు ససేమిరా అనడం, చివరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు చేయడం వరకు వెళ్లింది. పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్.. పట్టణంలో నిర్మించిన మ్యాన్‌హోల్స్ మురుగునీటితో పొంగిపొర్లుతున్నాయి. కాంట్రాక్టర్ గృహాలకు అనుసంధానం చేయకపోవడంతో ప్రజలు స్వయంగా కనెక్షన్లు కలుపుకున్నారు. దీంతో మ్యాన్హాల్స్ మొత్తం ఇళ్లలోని మురికినీటితో నిండి భయానకంగా తయారయ్యాయి. పస్తుతం వర్షాకాలం సీజన్ రావడంతో మురికినీటికి వర్షంనీరు తోడుకావడంతో పట్టణంలోని గంధవారిగూడెం, చైతన్యపురి కాలనీ, డీఈఓ కార్యాలయం ఎదురుగా, బోయవాడ స్కూల్ ఎదుట, సావర్కర్‌నగర్, ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పొంగిపొర్లుతూ రోడ్లపై ప్రవహిస్తున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసి మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టకపోతే అండర్‌గ్రౌండ్ పైపు లు, మ్యాన్‌హోల్స్ ఎక్కడికక్కడ పగిలి రూ.56 కోట్ల నిధులు నిష్ఫలమయ్యే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అండర్‌గ్రౌండ్ అసంపూర్తి నల్లగొండ పట్టణం లో ప్రజాప్రయోజనం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అం డర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను చేపట్టిన ప్రభుత్వం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైప్‌లైన్, మ్యాన్‌హోల్ తదితర వ్యవస్థలు పూర్తయి ఏడాదిన్నర గడిచినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హోల్స్లకు అనధికారికంగా ప్రజలే కనెక్షన్లు కలుపుకోవడంతో నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. దీంతో పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. - చెనగోని భిక్షం, శాస్త్రినగర్, నల్లగొండ