భూగర్భ(అండర్‌గ్రౌండ్) డ్రెయినేజీ పనుల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. తూరల సరఫరా, బినామీ కాంట్రాక్టులతో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. నల్లజర్లకు చెందిన ఈ ముఖ్య ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఎంచక్కా జేబు నింపుకుంటున్నారు. ఆ కథాకమామిషు..
టాస్క్‌ఫోర్స్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టారు. 70 శాతం ఉపాధి హామీ, 20 శాతం జెడ్పీ, 10 శాతం పంచాయతీ నిధులతో ఈ పనులు చేపట్టారు. కొన్నిచోట్ల పంచాయతీ వాటా భరించలేకపోతే దాతల ద్వారా సమకూరుస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగానికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు.
‘తూతూర’మంత్రంగా
నల్లజర్లకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సొంత మండలం నల్లజర్లలోనే 23 గ్రామాల్లో ఏకంగా రూ.35 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. తొలుత 11 స్మార్ట్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదని సమాచారం. ఉపాధి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా.. పొక్లెయిన్లతోనే కాలువలు తవ్వించారు. జాబ్ కార్డులూ టీడీపీ కార్యకర్తల పేరుతో ఇప్పించి పనులు చేసిన తర్వాత వాళ్ల ఖాతాల్లో సొమ్ములను వెనక్కి తీసుకుంటున్నారు. ఒక్కో కిలోమీటరు భూగర్భ డ్రెయినేజీకి అవసరమైన తూరలకు రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క నల్లజర్ల మండలంలో సుమారు 120 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ పనులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు రూ.17 కోట్ల నుంచి రూ.18 కోట్ల మేరకు తూరల కోసం వెచ్చించినట్టు సమాచారం. ఇక తాడేపల్లిగూడెం, దేవరపల్లి, ద్వారకాతిరుమలతోపాటు మిగిలిన మండలాలకూ తూరలను ఈ ప్రజాప్రతిని«ధే సరఫరా చేశారు. ఈ తూరల నాణ్యత అంతంత మాత్రమేనని సమాచారం. ప్రజా ప్రతినిధి కావడంతో అధికారులూ నోరుమెదపట్లేదు.
బినామీ పేర్లతో కాంట్రాక్టులు
భూగర్భ డ్రెయినేజీ పనులన్నీ ఈ ప్రజాప్రతినిధి బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్నారు. జగన్నాథపురం గ్రామాన్ని ఆయన సోదరుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ రూ.84.90 లక్షల విలువైన 9 పనులను ఆయనే బినామీ పేర్లతో చేపట్టారు. పుల్లలపాడులో రూ.60 లక్షల విలువైన పనులను అనుచరుడైన నామినేటేడ్ పదవిలో ఉన్న ఓ యువ నాయకుడు, స్థానిక ప్రజాప్రతినిధి చేశారు. నల్లజర్లలో పనులను నలుగురు టీడీపీ నేతలకు అప్పగించారు. ఇక్కడ రూ.2కోట్ల 94 లక్షల 50వేలతో 30 పనులు చేపట్టారు. మాజీ ప్రజాప్రతినిధికి ఐదు వార్డుల్లో పనులు అప్పగించారు. మరో ముగ్గురు స్థానిక ప్రజాప్రతినిధులకు మిగిలిన పనులు అప్పగించారు. గత ఎన్నికల్లో సహకరించడం వల్లే వారికి అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల్లో రూ.4.39 కోట్లు విలువైన చేపట్టారు. దాదాపు ఇవి పూర్తయ్యాయి. అయితే నాణ్యత అంతంతే. పడమర చోడవరంలో రూ.52.10 లక్షల పనులు జరగ్గా, స్థానిక ప్రజా ప్రతినిధికి 20 శాతం వాటా ఇచ్చి 80 శాతం ముఖ్యప్రజాప్రతినిధికి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అనంతపల్లి రూ.2 కోట్ల 75లక్షల 70 వేలు విలువైన పనులను స్థానిక మండల ప్రజాప్రతినిధి చేపట్టారు.
గత ఎన్నికల్లో ఈయన ముఖ్య ప్రజాప్రతినిధికి రూ.60 లక్షలు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. మారేళ్లమూడిలో రూ.85 లక్షల పనులు చేపట్టారు. ఇక్కడ ప్రజా ప్రతినిధి భర్తను అడ్డుపెట్టుకుని ముఖ్య ప్రజాప్రతినిధి స్వయంగా పనులు చేయిస్తున్నారు. శింగరాజుపాలెం రూ.1.35 లక్షల విలువైన పనులను ఓ ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేస్తున్నారు. తిమ్మన్నపాలెంలో రూ.25 లక్షలతో చేపట్టిన పనులను నల్లజర్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ద్వారా చేయించారు. అచ్చన్నపాలెంలో రూ.54 లక్షల 50 వేలు స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా కౌలూరులో రూ.59.40 లక్షల పనులను స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేయిస్తున్నారు. పోతవరంలో రూ.3 కోట్ల విలువైన పనులను ముఖ్య ప్రజాప్రతినిధి సన్నిహితుడు చేపట్టారు.
పట్టించుకోని నిబంధనలు
నల్లజర్ల మండలంలో చేపట్టిన డ్రెయినేజీ పనులను చూస్తే నిబంధనలు పాటించలేదని స్పష్టమవుతోంది. ప్రధాన డ్రెయిన్ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. కాంక్రీటు వేయకుండానే కేవలం ఇసుక వేసి దిమ్మెలు కట్టి పైపులు అమర్చారు. మురుగునీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయలేదు. సిమెంటు రోడ్లను ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నారు. నల్లజర్ల గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ అవుట్‌లెట్లను శివారున ఉన్న నల్ల, ఎర్ర చెరువులకు కలిపారు. ఇవి కలుషితమయ్యే దుస్థితి నెలకొంది.
అయ్యవారి తూరలే..!
డ్రెయినేజీ పనులకు సరఫరా చేసేందుకు ముఖ్య ప్రజాప్రతిని«ధి బినామీ పేర్లతో రెండు తూరల కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సరఫరా అవుతున్న తూరల నాణ్యత అంతంతే. దీనికి జిల్లా ఉన్నతాధికారి ప్రోత్సాహం ఉందని సమాచారం.
ఇబ్బందులే ఎక్కువ
అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టిన గ్రామాల్లో మురుగునీరు సరిగా పారడం లేదు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో సుమారు రూ.4 కోట్లతో డ్రెయినేజీ పనులు చేపట్టారు. ఇక్కడ మురుగునీరు పారక స్థానికులు ఇబ్బందులు పడుతున్నా రు. మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయి. రోడ్లపై నీరు పారుతోంది.
వసూళ్ల దందా
ఈ ప్రజాప్రతినిధి వసూళ్ల దందా కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల నల్లజర్లలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు దాతల నుంచి చందాలు వసూలు చేసి రూ. పదిలక్షల మేర మిగుల్చుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం మండలంలో ఓ గ్రామంలో బస్‌షెల్టర్ కోసమని నల్లజర్లలో సంక్రాంతి కోడి పందేల నిర్వహణకు రూ.6 లక్షలకు వేలం పెట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment