అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి! | Dammalapati Srinivas Fraud by Binami Company | Sakshi
Sakshi News home page

అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి!

Published Sun, Sep 27 2020 4:27 AM | Last Updated on Sun, Sep 27 2020 11:04 AM

Dammalapati Srinivas Fraud by Binami Company - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూముల విషయంలో ‘ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌’ ఆరోపణలతో ఏసీబీ కేసులో మొదటి నిందితునిగా ఉన్న మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, ఓపెన్‌ ప్లాట్‌ పేరుతో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు, మరికొందరు కలిసి తనను మోసం చేశారంటూ రిటైర్డ్‌ లెక్చరర్‌ కోడె రాజా రామమోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నాలుగవ నిందితునిగా చేర్చారు. ఈ ఫిర్యాదులోని అంశాలు ఇలా ఉన్నాయి.

► నేను ఓ రిటైర్డ్‌ లెక్చరర్‌ని. విజయవాడలో నాకు ఓ నివాస గృహం ఉంది. దానిని 2018 అక్టోబర్‌లో అమ్మేశాను. ఈ విషయం తెలుసుకుని నా పక్క ఊరుకు చెందిన వ్యక్తి కేవీజీ కృష్ణుడు అలియాస్‌ వేణు విజయవాడలోని ‘క్యాపిటల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కార్యాలయానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నన్నపనేని సీతారామరాజుకు నన్ను పరిచయం చేశారు. 
► సీతారామరాజు ‘లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్స్‌’పేరుతో తాము నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ బ్రోచర్‌ను నాకు చూపారు. ఈ ప్రాజెక్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ కుటుంబానికి సైతం భాగం ఉందని, వారి పలుకుబడి ద్వారా తమ కంపెనీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ భార్యకు సైతం భూమి ఉందని సీతారామరాజు చెప్పారు.
► ఆ కార్యాలయంలోనే నేను మొదటిసారి దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణిని కలిశాను. తాను రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేస్తున్నానని, ప్రభుత్వంలో ఎవరినైనా ప్రభావితం చేయగలనని, ఏ పనైనా చేసుకురాగలనని దమ్మాలపాటి, ఆయన భార్య నాకు హామీ ఇచ్చారు. వీరి ప్రేరేపణతో నేను ‘లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌’లో రెండు త్రిబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు కొనాలని నిర్ణయించుకున్నాను.

దమ్మాలపాటిని చూసే రూ.50 లక్షలు చెల్లించా 
► ఒక్కో ఫ్లాట్‌ను రూ.38.50 లక్షలకు అమ్ముతామని చెప్పారు. దీంతో నేను రెండ్లు ఫ్లాట్లకు అడ్వాన్సు కింద రూ.50 లక్షలు చెల్లించాను. వారు నాకు రెండు వేర్వేరు రసీదులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కోసం ఒత్తిడి తెచ్చాను. వారు అగ్రిమెంట్‌ చేయకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు.
► నేను ఒత్తిడి చేస్తున్నట్లు ఎవరూ చేయలేదని, ఆయన చెప్పిన చోట పెట్టుబడి పెట్టేందుకు ఆయన కార్యాలయం బయట వందల మంది ఎదురు చూస్తున్నారని దమ్మాలపాటి మాట్లాడారు. గట్టిగా ఒత్తిడి చేయగా చివరకు 2019 ఫిబ్రవరి 22న ఫ్లాట్‌ నంబర్‌ 1001కు కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌ చేశారు. రెండో ఫ్లాట్‌కు త్వరలోనే అగ్రిమెంట్‌ పంపుతామని చెప్పారు.
► చెల్లించాల్సిన మిగిలిన మొత్తానికి రూ.19 లక్షలు, రూ.18.65 లక్షలు, రూ.10.50 లక్షలకు ఆంధ్ర బ్యాంక్‌ పేరు మీద ఉన్న చెక్కులు ఇచ్చాను. ఆ రోజునే సీతారామరాజు వాటిని నగదుగా మార్చుకున్నారు. 

స్టార్‌ హోటల్స్‌ వస్తాయంటూ..
► ఆ తర్వాత సీతారామరాజు నాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు విస్తరణకు డబ్బు అవసరం ఉందన్నారు. అందువల్ల తాను, దమ్మాలపాటి శ్రీనివాస్‌ భార్య నాగరాణి సంయుక్తంగా కొన్న స్థలాన్ని అమ్ముతున్నామని, ఆ స్థలం చుట్టుపక్కల స్టార్‌ హోటల్స్‌ వస్తాయన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆ స్థలాన్ని నాకు చూపారు. స్టార్‌ హోటల్స్‌ వస్తాయని ఆయన కూడా చెప్పారు. 
► వాళ్ల మాటలు నమ్మి నా కుమార్తెను ఆ స్థలం కొనమని చెప్పాను. ఆమె ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి రూ.73 లక్షలు ఓపెన్‌ ప్లాట్‌ కోసం వారికి బదిలీ చేశాను. రెండు వారాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తానని హామీ ఇచ్చి, 2019 జూలై 24న లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ 1001ని మాత్రమే నా పేరు మీద రిజిష్టర్‌ చేశారు. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.  

తప్పుడు కేసులు పెడతామని బెదిరింపు
► సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే ఈ రిజిస్ట్రేషన్‌ సరైన రీతిలో చేయలేదని తెలిసింది. వారి ప్రవర్తనపై అనుమానంతో నా సోదరుడు సత్యప్రసాద్‌ను పంపి విచారించాను. ఈ ప్రాజెక్టుకు సమీపంలో వారికి ఎలాంటి ఓపెన్‌ ప్లాట్‌ లేదని కూడా తేలింది. దీంతో లేని ప్లాట్‌కు వాళ్లు నా ద్వారా నా కుమార్తెకు చెందిన రూ.73 లక్షలు తీసుకున్నారని అర్థమైంది.
► డబ్బు తిరిగి ఇవ్వమంటే న్యాయ వ్యవస్థలో, పోలీసుల్లో తమకు భారీ పలుకుబడి ఉందంటూ  సీతారామరాజు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు బెదిరిస్తున్నారు. నా డబ్బు కొట్టేసి, నాపైనే తప్పుడు కేసులు బనాయిస్తామంటున్నారు.
► లాక్‌డౌన్‌ వల్ల నేను హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయాను. అందుకే ఇప్పుడు విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశాను. దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి నాగరాణి, నన్నపనేని సీతారామరాజు, కేవీజీ కృష్ణుడు, అడుసుమిల్లి తనూజ, పొట్లూరి అనంత లక్ష్మీలు నన్ను దారుణంగా మోసం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement