సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చంద్రబాబు బినామీ సీఎం రమేష్ నాయుడు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పాదయాత్ర సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఆయన మండలంలోని కోనంపేట నుంచి బయల్దేరారు. పాదయాత్ర లక్కిరెడ్డిపల్లె చేరుకోగానే మహిళలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. మండలంలోని మూడు రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చారు. గజమాలతో సుధీర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మర్రిచెట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ పాలన వచ్చిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన 20ఏళ్లపాటు కొనసాగాలని, వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ పాలన అంతా దొంగలమయమన్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు బినామీగా పని చేస్తూ ఆయన ఆస్తులను కాపాడేందుకు బీజేపీలోకి జంప్ అయ్యారని విమర్శించారు. అధికారం లేకపోతే అరగంట కూడా ప్రతి పక్షంలో ఉండలేరన్నారు. ఇంకా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ క్షోభించక తప్పదన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఖాళీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో నిలిచిన కాలువల పనులను పూర్తి చేయించి సాగు నీటిని అందిస్తామన్నారు. వైఎస్ జగన్ సహకారంతో ఆరు నెలల్లోపు బ్రహ్మణి ఉక్కును ప్రారంభించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గండికోట ముంపు గ్రామాలలోని 7 గ్రామాలకు రూ.10లక్షలు పరిహారం అందజేస్తామన్నారు. జిల్లా వాసులు జగనన్నపై చూపిన అభిమానానికి వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment