సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా భూగర్భ డ్రెయినేజీ వచ్చిందంటే మురుగు నీటి కష్టాలు తప్పుతాయి. కానీ జిల్లాలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. డ్రెయినేజీ వేసిన తర్వాత దాని అవుట్‌లెట్లు అన్నీ ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేయాలి. అయితే జిల్లాలో అటువంటి ప్రతిపాదనలే లేకుండా పనులు జరిగిపోయాయి. కేవలం భూగర్భ డ్రెయినేజీ పైపులు వేసి వాటి అవుట్‌లెట్లను ఊరి చివర పంట బోదెలు, ఉర్లో ఉన్న చెరువులకు కలిపి వదిలేశారు. మరికొన్ని చోట్ల ఆయా రోడ్ల చివరి వరకూ పైపులు వేసి అక్కడ చిన్న గుంట తీసి అందులోకి నీరు వదిలిపెట్టేశారు. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు కూడా చేసేసుకున్నారు. మా పని అయిపోయింది.. మీ కష్టాలు మీరు వేసినా నిధులు మంజూరు చేశారు. కొన్ని గ్రామాల్లో కనీసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవుట్ లెట్ లేకుండా పనులు చూపించి నిధులు మంజూరు చేయించుకున్నారు.
‘సాక్షి’లో సోమవారం ‘అండర్‌గ్రౌండ్ రాజు’ శీర్షికన భూగర్భ డ్రెయినేజీ పనుల్లో జరిగిన అవకతవకలపై కథనం రావడంతో జిల్లాపరిషత్ ౖచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పందించారు. తన వివరణ తీసుకోకుండా వార్త ఎలా రాస్తారంటూ ‘సాక్షి’పై చిర్రుబుర్రులాడారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే భూగర్భ డ్రెయినేజీ పేరుతో పంట కాలువలను, చెరువులను కలుషితం చేయడం, వీధి చివర అవుట్‌లెట్లను వదిలివేయడంపై ఆయన స్పందించలేదు.
పట్టించుకోని నిబంధనలు : గ్రామాల్లో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థకు ప్రతి ఇంటినుంచి వచ్చే మురుగునీరు అనుసంధానమై ఉండాలి. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని ఎత్తుపల్లాలు లేకుండా భూగర్భంలో మురుగునీరు పల్లపు ప్రాంతం వైపు సజావుగా సాగేలా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఒక్కో గ్రామంలో నాలుగైదు వైపులకు నీరు వెళ్లేలా పనులు చేసి మమ అనిపించారు. కింద కాంక్రీట్ బెడ్ వేయకుండా రెండు ఇటుక రాళ్లను పెట్టి మధ్యలో పైపులను అమర్చి లైన్లు వేసేశారు. భవిష్యత్‌లో మధ్యలో పైపులు కుంగిపోతే డ్రెయినేజీ నీరు ముందుకు పారే అవకాశం ఉండదు. అంతేకాక ప్రతి ఇంటి నుంచి మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండానే డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. పనులకు ఉపయోగించిన తూరల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవువుతున్నాయి. భూగర్భ డ్రెయినేజీ అవుట్‌లెట్లను చెరువుల్లో పంట బోదెల్లో కలపడం వల్ల తాగునీరు, సాగునీరు కలుషితం అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment