ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు
అనుమతికి మించి రోడ్ల కటింగ్
కార్పొరేషన్ ఆదాయానికి గండి
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్:
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నరకం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కరీంనగర్ ప్రజలకు రిలయన్స్ తవ్వకాలు పులిమీద పుట్రలా మారాయి. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాల కోసం 36 కిలోమీటర్లకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్.. ఏకంగా 150 కిలోమీటర్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనివల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు నగరంలో కొత్తగా వేస్తున్న రోడ్లు ఛిద్రమవుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు మిలాఖత్ అయితే ఎలా ఉంటుందో ఈ పనులను చూస్తే తెలిసిపోతుంది.
అనుమతి ఇందుకు..
నగరంలో రిలయన్స్ కంపెనీకి చెందిన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేయడానికి నగరపాలకసంస్థ గత సంవత్సరం అక్టోబర్ 22న సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26 కిలోమీటర్ల మట్టిరోడ్డు, రెండున్నర కిలోమీటర్ల సీసీ రోడ్డు, ఎనిమిది కిలోమీటర్ల బీటీ రోడ్డు తవ్వి కేబుల్ వేయడానికి చార్జీల కింద రూ.2.25 కోట్లు కట్టించుకొని 11 షరతులతో కమిషనర్ అనుమతిని మంజూరు చేశారు.
నిబంధనలివీ..
రోడ్లను ఎక్కడ తవ్వుతున్నారో కార్పొరేషన్ ఏఈకి తెలియచేయాలి. రోడ్డు తవ్విన చోట వెంటనే రీఫిల్లింగ్ చేయాలి. తవ్వే ప్రదేశం చుట్టూ బారికేడ్లు వేయాలి. డీఈ సమక్షంలో మరమ్మతు పనులు చేపట్టాలి. వ్యక్తికి ప్రాణనష్టం జరిగితే కంపెనీ బాధ్యత వహించాలి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసు ఇవ్వకుండానే నగరపాలకసంస్థకు పనులు నిలిపివేసే అధికారం ఉంది. రోడ్డు కటింగ్ సమయంలో మంచినీటి, యూజీడీ పైప్‌లైన్‌లు పగిలితే కంపెనీదే బాధ్యత.
అనుమతి రద్దు... మళ్లీ పునరుద్ధరణ
రిలయన్స్ తవ్వకాలపై పలువురు మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ గత సంవత్సరం నవంబర్ 8న నగరపాలకసంస్థ కమిషనర్ ఎంసీకే/575/2013-14, తేదీ 08-11-2013 ద్వారా అనుమతి రద్దు చేశారు. అనంతరం డిసెంబర్ 4న ఎంసీకే/3755/2013-14, తేదీ 04-12-2013 ద్వారా అనుమతిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. రిలయన్స్ జేఐఓ నిబంధనలు పాటిస్తానని చెప్పడంతో, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి మౌఖిక ఆదేశాల మేరకు అనుమతిని పునరుద్ధరించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని రద్దు చేసినా, మళ్లీ ఎందుకు పునరుద్ధరించారనే ప్రశ్నకు సమాధానం లేదు.
లెక్కల్లేవు..
రిలయన్స్ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి... ఎన్ని కిలోమీటర్లు తవ్వుతున్నారనే సమాచారం నగరపాలకసంస్థ వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పనులపై కాంట్రాక్టర్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడంతోనే లెక్కకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
అనుమతి మీరి తవ్వకాలు రూ.15 కోట్లు ఎగవేత..
కాంట్రాక్టర్ అనుమతి మీరి తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ డివిజన్లలో 150 కిలోమీటర్లకు పైగా రోడ్లను తవ్వినట్లు మాజీ కార్పొరేటర్లు చెబుతున్నారు. 36 కిలోమీటర్ల మేర తవ్వడానికి నగరపాలక సంస్థకు రూ.2.25 కోట్లు చెల్లించగా, 150 కిలోమీటర్లు తవ్వి సుమారు రు.15 కోట్లు ఎగవేశాడంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు కావడం వల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, విచారణ నిర్వహిస్తే నిజాలు వెల్లడవుతాయని అంటున్నారు. అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ నిర్వహించి నగరపాలకసంస్థ ఆదాయం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
కేబుల్..గోల్‌మాల్
Published Fri, Jan 10 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement