optical fibre cable
-
హైదరాబాద్–బెంగళూరు సెక్షన్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–బెంగళూరు సెక్షన్లో 512 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) ఏర్పాటు పనులకు ఆమోదం తెలిపామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను గతేడాది సెప్టెంబర్ 23న మంజూరు చేసినట్టు బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి తెలిపా రు. ఇప్పటికే ఢిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్–బెంగళూరు హైవే వెంట మొత్తం 1880 కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేసే రెండు పైలట్ ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఈ రెండు–పైలట్ ప్రాజెక్ట్‌ల అనుభవం, సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఫలితాల ఆధారంగా, దేశంలోని జాతీయ రహదారి (గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ రెండూ) నెట్వర్క్ కోసం ఓఎఫ్సీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. 619 సీఎన్జీ కేంద్రాలు లక్ష్యం తెలంగాణలో మొత్తం 619 సీఎన్జీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మినిమం వర్క్ ప్లాన్ (ఎండబ్ల్యూపీ) లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్రంలో 134 సీఎన్జీ కేంద్రాలున్నాయని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధికంగా 88 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనీసం ఒక్క సీఎన్జీ కేంద్రం లేదని వెల్లడించారు. -
మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? కానీ, సెకనుకు 1.25 లక్షల జీబీ ఉంటే!
మీ ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? 50 ఎంబీపీఎస్ నుంచి 200 ఎంబీపీఎస్ దాకా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలో, బాగా అవసరమున్న చోటనో అయితే 2 జీబీపీఎస్ (సెకనుకు రెండు గిగాబైట్ల) వరకు ఉంటుంది. ఇంకా అవసరమైతే మరో కనెక్షన్ అదనంగా తీసుకుంటుంటారు. కానీ కేవలం ఒకే ఆఫ్టికల్ ఫైబర్ కనెక్షన్‌తో ఏకంగా పెటాబిట్ (1.25 లక్షల గిగాబైట్లు) డేటా ట్రాన్స్ఫర్ జరిగితే? జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) శాస్త్రవేత్తలు.. సరికొత్త సాంకేతికతతో ఈ వేగాన్ని సాధించారు. ఒక సెకనులో 51.7 కిలోమీటర్ల దూరంలోని పరికరాల మధ్య 1.02 పెటాబిట్స్ డేటాను ట్రాన్స్ఫర్ చేయగలిగారు. ఇది 5జీ ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే సుమారు లక్ష రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఇప్పుడున్న ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లనే దీనికి వాడుకోవచ్చని.. కొద్దిపాటి అదనపు మార్పులు, కొత్త పరికరాలను అనుసంధానం చేస్తే సరిపోతుందని ఎన్ఐసీటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలను ఇటీవల జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లేజర్ అండ్ ఎలక్ట్రో–ఆప్టిక్స్–2022’లో వెల్లడించారు. -
శాటిలైట్ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు
న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్టికల్ ఫైబర్ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్ టవర్ల అనుసంధానానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ ఆమోదం లభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. -
నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ పుష్
బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తదితర పలు నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రసంగం జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోడీ.. రానున్న 1,000 రోజుల్లో దేశంలోని ప్రతీ గ్రామాన్నీ ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించినట్లు తెలియజేశారు. భారత్‌నెట్ పేరుతో ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆప్ఠికల్ ఫైబర్ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దీంతో నెట్వర్క్ సంబంధిత పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ప్రస్తుతం పలు నెట్వర్క్ ఆధారిత కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. స్టెరిలైట్ టెక్నాలజీస్ 9 శాతం దూసుకెళ్లి రూ. 142ను తాకగా.. పాలీక్యాబ్ ఇండియా 3 శాతం ఎగసిరూ. 900కు చేరింది. ఈ బాటలో బిర్లా కేబుల్స్ 7.2 శాతం జంప్‌చేసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ఫినొలెక్స్ కేబుల్స్, అక్ష్ ఆప్టిఫైబర్, ఐటీఐ, కేఈఐ ఇండస్ట్రీస్, వింధ్యా టెలీలింక్స్, డెల్టన్ కేబుల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, యూనివర్శల్ కేబుల్స్ తదితరాలు 11-2 శాతం మధ్య లాభాలతో హల్చల్ చేస్తున్నాయి. -
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
-
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
సాక్షి, చెన్నై: చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మధ్య సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మరో 7 ద్వీపాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ అందించేలా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ఆవిష్కరించారు. ఓఎఫ్‌సీతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని మోదీ తెలిపారు. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీపం వరకు ఈ సేవ ప్రారంభమైందన్నారు. అంతులేని అవకాశాలతో నిండిన ఈ ఆవిష్కారంపై అండమాన్ అండ్ నికోబార్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అండమాన్ వాసులకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన, నమ్మదగిన మొబైల్, ల్యాండ్‌లైన్ టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా డిజిటల్ ఇండియా ఫలాలు అందుతాయన్నారు. టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్, టెలి మెడిసిన్, టెలీ విద్యలాంటి వసతులు సులువుగా అందుతాయన్నారు. అలాగే అనుకున్న సమయానికి 2300 కిలోమీటర్ల దూరం సముద్రం లోపల కేబుల్ వేయడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా టూరిజం మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అక్కడి వారికి నేడు చాలా ప్రత్యేకమైన రోజు అని స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుందంటూ సోమవారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో 2018 డిసెంబర్ 30న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. Inauguration of the submarine Optical Fibre Cable in Andaman and Nicobar Islands ensures: High-speed broadband connectivity. Fast and reliable mobile and landline telecom services. Big boost to the local economy. Delivery of e-governance, telemedicine and tele-education. — Narendra Modi (@narendramodi) August 10, 2020 -
కేబుల్..గోల్మాల్
ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అనుమతికి మించి రోడ్ల కటింగ్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నరకం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కరీంనగర్ ప్రజలకు రిలయన్స్ తవ్వకాలు పులిమీద పుట్రలా మారాయి. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తవ్వకాల కోసం 36 కిలోమీటర్లకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్.. ఏకంగా 150 కిలోమీటర్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనివల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు నగరంలో కొత్తగా వేస్తున్న రోడ్లు ఛిద్రమవుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు మిలాఖత్ అయితే ఎలా ఉంటుందో ఈ పనులను చూస్తే తెలిసిపోతుంది. అనుమతి ఇందుకు.. నగరంలో రిలయన్స్ కంపెనీకి చెందిన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేయడానికి నగరపాలకసంస్థ గత సంవత్సరం అక్టోబర్ 22న సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26 కిలోమీటర్ల మట్టిరోడ్డు, రెండున్నర కిలోమీటర్ల సీసీ రోడ్డు, ఎనిమిది కిలోమీటర్ల బీటీ రోడ్డు తవ్వి కేబుల్ వేయడానికి చార్జీల కింద రూ.2.25 కోట్లు కట్టించుకొని 11 షరతులతో కమిషనర్ అనుమతిని మంజూరు చేశారు. నిబంధనలివీ.. రోడ్లను ఎక్కడ తవ్వుతున్నారో కార్పొరేషన్ ఏఈకి తెలియచేయాలి. రోడ్డు తవ్విన చోట వెంటనే రీఫిల్లింగ్ చేయాలి. తవ్వే ప్రదేశం చుట్టూ బారికేడ్లు వేయాలి. డీఈ సమక్షంలో మరమ్మతు పనులు చేపట్టాలి. వ్యక్తికి ప్రాణనష్టం జరిగితే కంపెనీ బాధ్యత వహించాలి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసు ఇవ్వకుండానే నగరపాలకసంస్థకు పనులు నిలిపివేసే అధికారం ఉంది. రోడ్డు కటింగ్ సమయంలో మంచినీటి, యూజీడీ పైప్లైన్లు పగిలితే కంపెనీదే బాధ్యత. అనుమతి రద్దు... మళ్లీ పునరుద్ధరణ రిలయన్స్ తవ్వకాలపై పలువురు మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ గత సంవత్సరం నవంబర్ 8న నగరపాలకసంస్థ కమిషనర్ ఎంసీకే/575/2013-14, తేదీ 08-11-2013 ద్వారా అనుమతి రద్దు చేశారు. అనంతరం డిసెంబర్ 4న ఎంసీకే/3755/2013-14, తేదీ 04-12-2013 ద్వారా అనుమతిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. రిలయన్స్ జేఐఓ నిబంధనలు పాటిస్తానని చెప్పడంతో, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి మౌఖిక ఆదేశాల మేరకు అనుమతిని పునరుద్ధరించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని రద్దు చేసినా, మళ్లీ ఎందుకు పునరుద్ధరించారనే ప్రశ్నకు సమాధానం లేదు. లెక్కల్లేవు.. రిలయన్స్ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి... ఎన్ని కిలోమీటర్లు తవ్వుతున్నారనే సమాచారం నగరపాలకసంస్థ వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పనులపై కాంట్రాక్టర్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడంతోనే లెక్కకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. అనుమతి మీరి తవ్వకాలు రూ.15 కోట్లు ఎగవేత.. కాంట్రాక్టర్ అనుమతి మీరి తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ డివిజన్లలో 150 కిలోమీటర్లకు పైగా రోడ్లను తవ్వినట్లు మాజీ కార్పొరేటర్లు చెబుతున్నారు. 36 కిలోమీటర్ల మేర తవ్వడానికి నగరపాలక సంస్థకు రూ.2.25 కోట్లు చెల్లించగా, 150 కిలోమీటర్లు తవ్వి సుమారు రు.15 కోట్లు ఎగవేశాడంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కు కావడం వల్ల కార్పొరేషన్ రూ.15 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, విచారణ నిర్వహిస్తే నిజాలు వెల్లడవుతాయని అంటున్నారు. అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ నిర్వహించి నగరపాలకసంస్థ ఆదాయం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.