
మీ ఇంట్లో ఇంటర్‌నెట్ స్పీడ్ ఎంత? 50 ఎంబీపీఎస్ నుంచి 200 ఎంబీపీఎస్ దాకా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలో, బాగా అవసరమున్న చోటనో అయితే 2 జీబీపీఎస్ (సెకనుకు రెండు గిగాబైట్ల) వరకు ఉంటుంది. ఇంకా అవసరమైతే మరో కనెక్షన్ అదనంగా తీసుకుంటుంటారు. కానీ కేవలం ఒకే ఆఫ్టికల్ ఫైబర్ కనెక్షన్‌తో ఏకంగా పెటాబిట్ (1.25 లక్షల గిగాబైట్లు) డేటా ట్రాన్స్‌ఫర్ జరిగితే?
జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్‌ఐసీటీ) శాస్త్రవేత్తలు.. సరికొత్త సాంకేతికతతో ఈ వేగాన్ని సాధించారు. ఒక సెకనులో 51.7 కిలోమీటర్ల దూరంలోని పరికరాల మధ్య 1.02 పెటాబిట్స్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలిగారు. ఇది 5జీ ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే సుమారు లక్ష రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
అంతేకాదు ఇప్పుడున్న ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లనే దీనికి వాడుకోవచ్చని.. కొద్దిపాటి అదనపు మార్పులు, కొత్త పరికరాలను అనుసంధానం చేస్తే సరిపోతుందని ఎన్‌ఐసీటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలను ఇటీవల జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లేజర్ అండ్ ఎలక్ట్రో–ఆప్టిక్స్–2022’లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment