బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ దివాళా
టోక్యో: కాల్పనిక(వర్చువల్) కరెన్సీల కథ కొద్దికాలానికే కంచికి చేరే పరిస్థితి నెలకొంది. ఇలాంటి మిథ్యా కరెన్సీలు గాలిలో దీపమేనన్న ఆందోళనలకు అంతకంతకూ బలం చేకూరుతోంది. వర్చువల్ కరెన్సీలో అగ్రగామిగా నిలుస్తున్న బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్... మౌంట్‌గాక్స్ జపాన్‌లో శుక్రవారం దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా తమ ఎక్స్ఛేంజ్ డిజిటల్ వాల్ట్(కరెన్సీ దాచే సర్వర్లు)పై హ్యాకర్లు దాడిచేసి డిజిటల్ కరెన్సీని దొంగలించారని... దీనివల్ల సుమారు 50 కోట్ల డాలర్ల(రూ. 3,100 కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు మౌంట్‌గాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ కార్ప్‌లెస్ వెల్లడించారు. తమ కస్టమర్లకు చెందిన సుమారు 7,50,000 బిట్‌కాయిన్లతోపాటు ఎక్స్ఛేంజ్ సొంత స్టోర్‌లోని లక్ష బిట్‌కాయిన్లను చౌర్యానికి గురయ్యాయని మౌంట్‌గాక్స్ లాయర్ వెల్లడించారు. వీటి విలువ 47.7 కోట్ల డాలర్లు.
6.4 కోట్ల డాలర్ల అప్పులు...
మౌంట్‌గాక్స్‌కు దాదాపు 6.4 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయని కార్ప్‌లెస్ వెల్లడించారు. ఫిబ్రవరి మొదట్లో ఎక్స్ఛేంజ్ వాల్ట్‌పై హ్యాకర్ల దాడి కారణంగా సుమారు 10 లక్షల మంది బిట్‌కాయిన్ వినియోగదార్లపై ప్రభావం చూపినట్లు చెప్పారు. కాగా, హ్యాకర్ల దాడివల్ల మౌంట్‌గాక్స్ ఎక్స్ఛేంజ్‌ను ఈ వారంలోనే మూసివేయడంతో అంతర్జాతీయంగా వర్చువల్ కరెన్సీ యూజర్లు షాక్‌కు గురయ్యారు. ఈ నెల మొదటివారంలో తమ బిట్‌కాయిన్ సాఫ్ట్‌వేర్‌కు హ్యాకింగ్ గురవడంతో సమస్యలు తలెత్తాయని చెబుతూ కస్టమర్లకు కరెన్సీని విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని మౌంట్‌గాక్స్ స్తంభింపజేసింది కూడా.
2009 ఆరంభంలో ఉనికిలోకివచ్చిన ఈ బిట్‌కాయిన్ వర్చువల్ కరెన్సీ వ్యవస్థ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించింది. ఆన్‌లైన్‌ద్వారా మాత్రమే లావాదేవీలు, ట్రేడింగ్, కొనుగోళ్లు ఇతరత్రా కార్యకలాపాలను చేసుకునేలా ఈ డిజిటల్ కరెన్సీ పుట్టుకొచ్చింది. గతేడాది నవంబర్‌లో ఒక బిట్‌కాయిన్ విలువ 1,100 డాలర్లను (సుమారు రూ.68 వేలు) తాకగా.. ఇప్పుడిది రూ.35 వేల స్థాయికి పడిపోయింది. ఇలాంటి వర్చువల్ కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా 70 వరకూ ఉండగా.. బిట్‌కాయిన్ అగ్రస్థానంలో ఉంది. కాగా, ఈ కరెన్సీలపై ఏ దేశంలోనూప్రభుత్వ నియంత్రణలు లేవు. దీంతో మౌంట్‌గాక్స్‌లో సొమ్ము కోల్పోయిన కస్టమర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.