సాక్షర భారత్ కు నిధుల గండం | Government neglects to release Honorary wage under Saakshar bharat programme | Sakshi
Sakshi News home page

సాక్షర భారత్ కు నిధుల గండం

Published Tue, Nov 26 2013 6:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

Government neglects to release Honorary wage under Saakshar bharat programme

=    నిలిచిన రూ. 6.61 కోట్ల నిధులు
 =    మండల, గ్రామ కో ఆర్డినేటర్లకు అందని జీతాలు
 =    15 నెలలుగా పస్తులుంటున్నామని ఆవేదన

 
 యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం నీరుగారే దశలో ఉంది. మండల, గ్రామ కోఆర్డినేటర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా గ్రామాల్లో సాక్షర భారత్ కార్యక్రమాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం, మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ఇది ఇంతో ఉపయోగకరం. ఉదయంపూట అందరి చేత పత్రికలు, కథల పుస్తకాలు చదివి వినిపించి, పనులకు వెళ్లి తిరిగి వచ్చాక రాత్రి వేళల్లో అక్షరాలు నేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వారికిచ్చే స్వల్ప వేతనం కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు.
 
 జిల్లాలోని 1041 పంచాయతీల్లో 2082 సాక్షర భారత్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్కో గ్రామ కోఆర్డినేటర్ ఉంటారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున జిల్లాలో 56 మంది మండల కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్‌కు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్‌కు నెలకు రూ. 2 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. మండల కోఆర్డినేటర్లకు 11 నెలలుగా రూ. 36.92 లక్షలు, గ్రామ కోఆర్డినేటర్లకు 15 నెలలుగా రూ. 6,24,60,000 ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి గౌరవ వేతనాలను నెలల తరబడి నిలుపుదల చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన వేతనాలను తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోఆర్డినేటర్లు కోరుతున్నారు.  
 
 
 రూ. 30 వేలు రావాలి
 చేదూరి కాంతమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం
 15 నెలల నుంచి మాకు గౌరవ వేతనం అందడం లేదు. నాకు రూ. 30 వేలు రావలసి ఉంది. వెంటనే ఇప్పించి ఆదుకోండి.
 
 ఇబ్బందులు పడుతున్నాం
 పరిమి త్రిపురమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం
 గౌరవ వేతనం నెలల తరబడి అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటిని నెట్టుకొచ్చేందుకు అప్పులు చేస్తున్నాం. అధికారులు మాపై దయచూపాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement