ఇదేనా ‘గౌరవం’
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించి న ఉద్యోగులు తమకు చెల్లించిన గౌరవ వేతనంపై అసంతృప్తితో ఉన్నారు. ఆయా ప్రాంతా ల దూరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ ఒకే రీతిలో భత్యం చెల్లించడంపై గుర్రుగా ఉన్నారు. సమీప, సుదూర నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించిన వారికి ఒకే విధమైన భత్యం ఇవ్వ డం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పోలింగ్ కేం ద్రాల్లో అవస్థలు పడ్డామని ఆవేదనతో ఉన్నారు. ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించే స్థానం నుంచి దూరాన్నిబ ట్టి గౌరవ వేతనం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మండు వేసవిలో గంటల తరబడి ప్రయా ణం చే యడం, తిరుగు ప్రయాణంలోనూ అదే స్థా యిలో అవస్థలు ఎదుర్కొన్నా తమకు నిబంధనలు సాకుగా చూపి తక్కువ చెల్లించడం సరికాదని పేర్కొంటున్నారు.
నిబంధనలు హుష్‌కాకి
జిల్లావ్యాప్తంగా పీవోలు, ఏపీవోలు 5,297, ఓపీవోలు 10,707 మంది సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించారు. వీరికి పోలింగ్ ఆఫీసర్(పీవో)కు రూ.350, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్(ఏపీవో), అదర్ పోలింగ్ ఆఫీసర్(ఓపీవో)లకు రోజుకు రూ.250 చెల్లించారు. ఎన్నికల విధుల్లో భాగంగా రెండ్రోజుల శిక్షణ, రెండ్రోజుల విధి నిర్వహణ ఉంటుంది. మొదట శిక్షణ ఉద్యోగి తాను విధులు నిర్వర్తించే మండలంలో ఉంటుంది. రెండో శిక్షణతోపాటు ఎన్నికల విధుల కోసం సంబంధిత నియోజకవర్గానికి వె ళ్లాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు సంకటంగా మారింది. ఉదాహరణకు ముథోల్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పలువురికి సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు వేశారు.
వారు ఒక సారి శిక్షణకు వచ్చి వెళ్లేసరికే రూ.350 ఖర్చు అవుతాయి. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణ సమయం అదనం. విధుల నిర్వహణ గౌరవ వేతనం తక్కువగా ఉన్నా టీఏ, డీఏ చెల్లించడంలో నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. ఎనిమిది కిలోమీటర్ల పైబడి విధులు నిర్వహించేవారికి కిలో మీటర్లను బట్టి ప్రయాణ భత్యం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. కానీ, అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహా సమస్య ఎదురైందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
అధికారులతో అవస్థలు.. కానరాని ఏర్పాట్లు..
పోలింగ్ రూట్లు, ఏర్పాట్లపై అవగాహన లేకుండా వ్యవహరించిన కొందరు ఎన్నికల అధికారుల వల్ల ఇబ్బందు లు ఎదుర్కొన్నట్లు సిబ్బంది వాపోతున్నారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి వరకు సామగ్రి పంపిణీ చేయకపోవడంతో ఇక్కట్లు పడ్డట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అధికారులతో పలువురు సిబ్బంది గొడవకు దిగారు. రాత్రి వేళల్లో సామగ్రిని తీసుకొని ఇబ్బందుల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం చోట్ల సిబ్బందికి వసతులు కల్పించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయా ప్రాంతాల్లో కనీసం విశ్రాంతి తీసుకునే వాతావరణం లేకపోవడం పోలింగ్ విధులు చేపట్టేందుకు వెళ్లిన వారిని అసహనానికి గురి చేసింది.
మహిళా సిబ్బంది బాధలైతే వర్ణనాతీతం. కనీస అవసరాలు కల్పించకపోవడంతో మారుమూల ప్రాంతాలతోపాటు మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన వారు ఇబ్బంది పడ్డారు. సంబంధిత మండలాల్లోని రేషన్ డీలర్లను ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్లు ఆదేశించారు. వారు సిబ్బందికి ఏర్పాట్లు చేయలేక ఇబ్బందులు పడ్డారు. రీఫ్రెష్‌మెంట్ అలవెన్స్ కింద ఒక్కో ఉద్యోగికి రూ.150 రోజుకు చెల్లించాల్సి ఉంది. ఇవి ఉద్యోగులకు అందించలేదు. మరోవైపు వారికి భోజన ఏర్పాట్లు రేషన్‌డీలర్ల చేత చేయించారు. ఈ నేపథ్యంలో రీఫ్రెష్‌మెంట్ కోసం కేటాయించిన రూ. లక్షల నిధులు ఖర్చుచేసినట్లు మాయ చేస్తారా లేక తిరిగి ప్రభుత్వానికి పంపిస్తారా అనేది తేలాల్సి ఉంది.