ఉద్యోగులను చంద్రబాబు ద్రోహులుగా చూశారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను, అధికారులను ప్రజల ముందు ద్రోహులుగా చిత్రీకరించి అవమానాలకు గురిచేసిన చంద్రబాబునాయుడు పాలనను ప్రతి ఉద్యోగి, రిటైర్డ్ ఎంప్లాయి గుర్తించుకున్నారని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ ఫోరం నిర్వాహక అధ్యక్షుడు బీవీ సుబ్బారావు అన్నారు. ఏలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించి ఎందరో విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. బాబు పాలనలో ఉద్యోగ విరమణలతో ఖాళీ అయి న స్థానాలను కూడా భర్తీ చేయకుండా అదనపు భారం వేసి ఉద్యోగులను మానసికంగా హింసించారని గుర్తుచేశారు. 1998లో వేతన సవరణ కమిషన్ కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసినా కనీసం చంద్రబాబు స్పందించ లేదన్నారు. చంద్రబాబు ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎలా విస్మరించగలమని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చెబుతున్న ఏ ఒక్క పథకాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని, ప్రపంచంలో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే అని అన్నారు.
చంద్రబాబువి కపట నాటకాలు
రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో సీమాంధ్రులకు ద్రోహం చేశారని సుబ్బారావు విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చంద్రబాబు ఆడుతున్న నాటకాలు పౌర సమాజాన్ని అపహాస్యం పాల్జేశాయని విమర్శించారు. రాష్ట్ర విభజనను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ ప్రకటన వెలువరించిన వెంటనే కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి రూ.4 లక్షల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. దీంతో పాటు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అధికార పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేసిన చంద్రబాబు ప్రపంచ రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయారని సుబ్బారావు చెప్పారు.
జగన్ అంకితభావం అమోఘం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కలిగిందని సుబ్బారావు అన్నారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య ఉద్యమంలో ప్రదర్శించిన అంకితభావం ఆయనపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందన్నారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఫోరం తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి.బాబూజీరావు, సభ్యుడు బి.కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు శిరిపల్లి ప్రసాద్, మోర్త రంగారావు పాల్గొన్నారు.
వైఎస్ వల్లే మా కుటుంబం నిలిచింది
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల నా ప్రాణం నిలబడింది. నిడదవోలు రైల్వే ఓవర్‌బ్రిడ్జి సెంటర్‌లో అద్దెంట్లో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఏంచేయాలో పాలుపోలేదు. భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబాన్ని పోషించుకురావడమే కష్టమనుకుంటున్న సమయంలో ఆపరేషన్ ఎలా అని మదనపడ్డాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తారని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో ధైర్యం వచ్చింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈ రోజు భార్య, బిడ్డలతో ఆనందంగా ఉన్నానంటే అదంతా వైఎస్ చలవే. ఆయన ఆశయాలను, పథకాలను కొనసాగించే నేత రావాలి. అప్పుడే మాలాంటి పేదోళ్లకు మేలు జరుగుతుంది.
- వెంకటేశ్వరరావు లారీ డ్రైవర్, కుటుంబ సభ్యులు, నిడదవోలు
రాజన్న పుణ్యమా సొంతిల్లు సమకూరింది
స్వతహాగా కమ్యూనిస్ట్ నాయకుడిని అయిన నేను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో 2004లో కాంగ్రెస్‌లో చేరాను. వైఎస్ పుణ్యమా నాకు సొంతిల్లు సమకూరింది. గత ఏడాది మార్చిలో హఠాత్తుగా గుండెపోటు వస్తే ఆరోగ్యశ్రీ వల్ల ప్రాణం నిలిచింది. ఈ రోజు నేను ఇలా మీతో మాట్లాడుతున్నానంటే అదంతా ఆ పెద్దాయనే చలవే. ఆయన ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడు రావాలి. యువనాయకత్వంతోనే రాష్ర్టం అభివృద్ధి చెందుతుంది. అలాంటి పార్టీ, నేతకే నా ఓటు.
- మర్రి ప్రకాశం, అరుంధతి కాలనీ, బుట్టాయగూడెం
అది రైతులకు స్వర్ణయుగం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. రైతులకు ఆరోజుల్లో కష్టమంటే ఏమి టో తెలిసేది కాదు. ఆయన మరణంతోనే మా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు విద్యుత్ కోతలు ఎక్కువవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వైఎస్ పాలనలో కోతలంటే ఏంటో తెలిసేది కాదు. అప్పట్లో కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ. 380 ఉంటే ఇప్పుడు 1,180కు చేరింది. పొటాష్ బస్తా రూ. 280 ఉంటే ఇప్పుడు రూ. 850 పెట్టి కొంటున్నాం. మళ్లీ రాజన్న పాలన రావాలి.
- దండు వెంకట కృష్ణంరాజు, రైతు, దేవులపల్లి,
జంగారెడ్డిగూడెం మండలం