జోరుగా పైరవీలు రంగంలోకి దళారులు
సాంఘిక సంక్షేమ శాఖలో అదో జాతర
అనంతపురం సిటీ : సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల జాతర నెలకొంది. దరఖాస్తులు సమర్పించడం పూర్తయినా ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లు పైబడిన వారందర్నీ బదిలీ చేయాలని జీవో విడుదల చేయడంతో ఉద్యోగులు తాము ఉన్న చోటే ఉండాలని పైరవీలకు దిగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగప్రవేశం చేసి ఉద్యోగులను మభ్య పెట్టే పనిలో పడ్డారు. అవసరమైన మేర అన్ని నిబంధనలను ఉపయోగించుకుని తమకు కావాల్సిన చోటుకు వెళ్లేందుకు, నిబంధనలను తుంగలో తొక్కి ఉన్న చోటే ఉండేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
బదిలీలను సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు తమకు వరంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇందుకు ఆ శాఖలోని ఓ ముఖ్య ఉద్యోగి ద్వారా పైరవీలు సాగిస్తున్నట్లు తెల్సింది. ముఖ్యంగా నాలుగవ తరగతి ఉద్యోగుల బదిలీల విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని కార్యాలయ వర్గాల్లో బహిరంగ చర్చ నడుస్తోంది. బదిలీలు కావాలంటూ వచ్చిన దరఖాస్తులు ఇందుకు ఊతమిస్తున్నాయి. జీవో ప్రకారం హార్ట్ సర్జరీ, బుద్ది మాంద్యత, వికలత్వం కలిగిన పిల్లలు ఉన్నా, అంగవైకల్యం ఉన్నా కోరుకున్న చోటుకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
కానీ ఆ అర్హతలు లేకనే 85 మంది 4వ తరగతి ఉద్యోగులు బదిలీ కావాలంటూ దరఖాస్తులు ఇచ్చారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆప్షన్ పత్రాలు సమర్పించారు. వారిలో ఒకరు అంగ వైకల్యం కలిగిన వారు కాగా మరొకరు అంధులు. మిగిలిన 83 మంది ఏ ఆప్షన్ లేకనే దరఖాస్తు చేసుకున్నారు. పక్కా జీవో ఆధారంగా దరఖాస్తులు స్వీకరించాల్సిన కార్యాలయ సిబ్బంది నిబంధనలకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలూ సమర్పించకున్నా స్వీకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కార్యాలయ సిబ్బంది పక్కా పైరవీలకు తెరతీసినట్లు స్పష్టమవుతోంది.
రాజకీయ నాయకుల ఒత్తిళ్లు
తమకు తెలిసిన వారిని కావాల్సిన చోటికి బదిలీ చేయాలని జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే డీడీ బి.జీవపుత్రకుమార్ కాస్త కఠినంగా వ్యవహరిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు. అయితే సంబంధిత శాఖా మంత్రికి చెందిన అనుచరులకు మాత్రం బదిలీల్లో అర్హతలు లేకపోయినా సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇతర రాజకీయ నాయకులు, సిబ్బంది డీడీపై గుర్రుగా ఉన్నట్లు తెల్సింది. ఇప్పటికే విధి నిర్వహణ విషయంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి సిబ్బందికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఇక బదిలీల విషయంలో ఒకరికి సహకరించి, మరొకరికి సహకరించకపోతే విబేధాలు మరింత ముదిరే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది.
బదిలీలలు
Published Wed, May 27 2015 2:19 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement