- పాత స్థానాలకు వెళ్లనున్న ఉద్యోగులు
- బదిలీ ఉత్తర్వులు నెలాఖరులోగా వెలువడే అవకాశం..?
- పదోన్నతి పొందిన వారికి నిరాశే మిగలనున్న వైనం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనంగా జరిగే సమయం దగ్గర పడుతుండడంతో ఉద్యోగుల్లో బదిలీల ఆందోళన మొదలైంది. స్థానిక, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదో జోన్ పరిధిలోని ఉద్యోగులు తమ సొంత జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
అయితే తెలంగాణ ఏర్పాటు(అపాయింటెడ్ డే) గడువు సమీపిస్తుండ డంతో సొంత జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు వారి వారి జిల్లాలకు వారు రానున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాగా, బదిలీల విషయంలో ఎన్నికల ముందు పదోన్నతి పొంది ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి నిరాశే మిగుల నున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు జిల్లా నుంచి స్థానికత, మూడేళ్ల సీనియారిటీ కారణాలతో వేరే జిల్లాకు బదిలీ అయినవారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే యథాస్థానాలకు రానున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయమై ఉద్యో గ సంఘాల నాయకులు ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించినట్లు సమాచారం.
28న ఉత్తర్వులు విడుదల..?
రాష్ట విభజనకు సంబంధించి అపాయింటెడ్ డే(జూన్2) కన్నా ముందే ఉద్యోగులు ఎవరి స్థానాలకు వారు చేరితే మంచిదనే అభిప్రాయంతో ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. లేని పక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదంతోపాటు ఇతర సమస్యల కారణంగా జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఉమ్మడిగా ఉ న్న సమయంలోనే ఈ తతంగం ముగించాలని ఉద్యోగ సంఘా లు ప్రయత్నిస్తున్నాయి. అయితే సార్వత్రిక, ఉపఎన్నికల సమయంలో అవలంభించిన విధానాన్ని ప్రస్తుతం అమలు చేయడం లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవడంతో త్వరితగతిన పనులు చక్కబెట్టి ఈనెల 28న ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు సమాచారం.
వచ్చినవారు 100కు పైనే...
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డీడీ, ఏడీ, తహసీల్దార్, ఎంపీడీఓ హో దాల్లో ఉన్నవారు మొత్తంగా జిల్లా నుంచి 100 మందికి పైగా ఇతర జిల్లాలకు బదిలీఅయ్యారు. ఇందులో తహసీల్దార్లే 50 మందికి పైగా ఉన్నారు. అయితే వీరితోపాటు మరో 15 మంది వరకు డీటీలు.. తహసీల్దార్లుగా పదోన్నతి పొంది పక్క జిల్లాల కు వెళ్లారు. కాగా, ప్రభుత్వం ఎక్కడోళ్లను అక్కడికే పంపించాల ని చర్యలు తీసుకుంటే వీరంతా ఈ నెలాఖరులోగా ఎవరిస్థానాల్లో వారు చేరే అవకాశం ఉంది.
పదోన్నతి పొందిన వారికి నో చాన్స్...
ఎన్నికలను పురస్కరించుకుని బదిలీపై పక్క జిల్లాకు వెళ్లిన వారి కి మాత్రమే యథాస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే పదోన్నతిపై వెళ్లిన వారికి మాత్రం ఈ బదిలీలువర్తించవని తెలుస్తోంది. కాగా, వీరు కూడా ఎవరి జిల్లాకు వారు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ స్వ యంగా ముఖ్యమంత్రి ఆమోదిస్తేనే ఉత్తర్వులు వెలువడేఅవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.
రాజకీయ బదిలీలకు అవకాశం..
ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరు ఆర్డీఓ, డీడీ స్థాయి అధికారులకు బదిలీలు తప్పవని ప్రచారం సాగుతోంది. ఇక విభజన నేపథ్యంలో జిల్లా నుంచి కనీసం ఐదుగురు అధికారుల వరకు జిల్లా నుంచి బదిలీ అవుతారని సమాచారం. పౌర సంబంధాలశాఖ పీఆర్‌ఓ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ట్రెజరీ అధికారి, జేడీఏ ఇలా పలువురు అధికారులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రభుత్వం నుంచి బదిలీల విషయంలో విధి విధానాలు ఖరారు కాకపోవడంతో వీరంతా మిన్నకున్నట్లు సమాచారం. దీనికి తోడు గతంలో జిల్లాలోని మంచి పోస్టులకు రాజకీయ ప్రమేయంతో వచ్చినవారు, అమాత్యుల బంధుగణంగా ఉన్నవారు కూడా స్థానచలనం పొందే అవకాశాలున్నాయని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కాగా, జిల్లాలో ఉన్నతాధికారులకు బదిలీలు తప్పవ ని తేలడంతో ఆ స్థానాల కోసం కొందరు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ ఆర్డీఓ పోస్టులతోపాటు కొన్ని డీడీ స్థాయి పోస్టులకు పైరవీలు ఊపందుకున్నట్లు సమాచారం. అయితే రాజకీయ బదిలీలు మాత్రం కొత్త రాష్ట్రం పూర్తిస్థాయిలో ఏర్పడిన తర్వాత జరిగే అవకాశం ఉంది.