ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ :
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా పోరాడుతున్న ఉద్యోగులు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజా ప్రతినిధుల తీరును ఎండగడుతున్నారు. రాజీనామా చేయకపోతే భవిష్యత్‌లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం 58వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు భారీ ఎత్తున సాగాయి
ఒంగోలు నగరంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట వాహనాలు శుభ్రం చేసి నిరసన తెలిపారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ముందు రాజీనామా చేసి మాట్లాడాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. చివరకు ఎంపీ కూడా ఉద్యోగులతో కలిసి వాహనాలు శుభ్రం చేసి నిరసన తెలిపారు. మైనంపాడు డైట్ కాలేజీ విద్యార్థులు చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రోడ్డుపై వాలీబాల్ ఆడారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. రెండు రోజుల పాటు వాహనాలు నిలిపివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.
వెనక్కితగ్గని ఆందోళనకారులు
చీరాల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. వేటపాలెంలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించారు. పర్చూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఆంగన్‌వాడీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఇంకొల్లులో టైలర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లపైనే మిషన్లు పెట్టి దుస్తులు కుట్టారు. సమైక్యాంధ్ర ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్‌జీఓ నాయకులు కోటప్పకొండకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మేదరమెట్లలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి రిలే దీక్షలు ప్రారంభించారు. గిద్దలూరు పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉద్యమంలో పాల్గొనేందుకు గ్రామాలకు గ్రామాలే కదిలి వస్తున్నాయి. మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లె గ్రామ ప్రజలు ర్యాలీగా గిద్దలూరు చేరుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉలవపాడులో మహాగర్జన నిర్వహించారు. వేలాది మంది గర్జనలో పాల్గొని సమైక్యాంధ్ర కోసం నినదించారు. కందుకూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఐకేపీ కార్యాలయంలో సమావేశాన్ని అడ్డుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులతో నినాదాలు చేయించారు. గుడ్లూరులో సమైక్యవాదుల దీక్షలు రెండో రోజుకు చేరాయి. టంగుటూరు మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కనిగిరి పట్టణంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి
. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో క్రిస్టియన్ మైనార్టీలు రిలేదీక్షలు చేపట్టారు. మార్కాపురంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. పట్టణంలోని ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పొదిలిలో రజక సంఘం నేతృత్వంలో రోడ్డుపైనే దుస్తులు శుభ్రం చేసి నిరసన తెలిపారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. త్రిపురాంతకంలో ప్రైవేట్ పాఠశాలలు మూసివేశారు. దోర్నాలలో ఉపాధ్యాయ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన కాపు సింహగర్జనతో యర్రగొండపాలెం దద్దరిల్లింది. పలు వేషధారణలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై వంటా-వార్పు చేపట్టి నిరసన తెలిపారు.
జిల్లాలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర నిరసనలు
Published Fri, Sep 27 2013 3:43 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement