ఏదీ చెత్త శుద్ధి..? | Government officers neglected to garbage works in nelloru | Sakshi
Sakshi News home page

ఏదీ చెత్త శుద్ధి..?

Published Mon, Mar 25 2019 3:56 PM | Last Updated on Mon, Mar 25 2019 4:00 PM

Government officers neglected to garbage works in nelloru - Sakshi

దొంతాలి డంపింగ్‌ యార్డు

నెల్లూరు సిటీ: చెత్త.. చెత్త కాదు.. సద్వినియోగం చేసుకుంటే సంపద.. అంటూ నగరపాలక సంస్థ, మున్సిపాల్టీల్లో ఆటోల్లో ఊదరగొడుతున్నారు. చెత్తాచెదారాలతో విద్యుదుత్పత్తి చేసేందుకు మూడేళ్ల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పాలకవర్గం మాత్రం దోచుకోవడం, దాచుకోవడంపై పెట్టే శ్రద్ధను ప్రజల సమస్యలు, అవసరాలపై చూపడం లేదు. 


పట్టించుకోని మంత్రి నారాయణ
నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీల్లో పోగయ్యే చెత్తను నెల్లూరు శివారు ప్రాంతాలకు తరలించి విద్యుదుత్పత్తి కేంద్ర ఏర్పాటుకు అప్పట్లో సన్నాహాలు చేశారు. అయితే ఇప్పటికీ ఆ ఊసే లేకుండాపోయింది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత జిల్లాలోనే విద్యుదుత్పత్తి కేంద్ర ఏర్పాటులో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర పరిధిలో రోజూ 270 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంది. అయితే పాలకవర్గ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌ సిటీ చేస్తామనే మంత్రి నారాయణ మాటలు నీటి మూటలేనని తేలిపోయింది.


టీడీపీ నేతల ఆటంకాలు
మరికొన్ని సంస్థలు విద్యుదుత్పత్తి కేంద్ర ఏర్పాటుకు ముందుకొస్తున్నా టీడీపీ నేతలు మోకాలడ్డుతున్నారు. మంత్రి నారాయణ వద్దకు కొన్ని సంస్థలు వెళ్లినా వారికి కుంటిసాకులు చెప్తూ వాయిదాలు వేస్తున్నారు. దీంతో సంస్థలు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమనే భావనలో ఉన్నాయి. 


పట్టని బోడిగాడితోట వాసుల గోడు
నగరంలోని స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట, బాలాజీనగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, తదితర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే చెత్తను బోడిగాడితోట ట్రాన్సిట్‌ పాయింట్‌కు రోజూ ఆటోల ద్వారా డంపింగ్‌ చేస్తుంటారు. ఇక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా దొంతాలి డంపింగ్‌యార్డుకు తరలించాల్సి ఉంటుంది. అయితే శానిటరీ అధికారులు వారం, పది రోజులకోసారి మాత్రమే చెత్తను తరలిస్తుంటారు. దీంతో స్థానికంగా ఉండే వందలాది కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. బోడిగాడితోటలో చెత్తను డంపింగ్‌ చేయొద్దంటూ గతంలో అనేక సార్లు స్థానికులు నిరసన తెలిపినా, పాలకవర్గం, అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.  

పత్తా లేని కాంట్రాక్ట్‌ సంస్థ
వెంకటాచలం మండలం సర్వేపల్లిలో 20 ఎకరాలు విద్యుదుత్పత్తికి అనువైన స్థలమని అధికారులు భావించారు. దీంతో అప్పట్లో విద్యుదుత్పత్తి కేంద్ర ఏర్పాటుకు కేటాయించారు. తొలుత దొంతాలి, అల్లీపురం ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా స్థానికులు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడంతో విరుమించుకున్నారు. సర్వేపల్లికి సమీపంలో నిర్మాణం తలపెట్టడంతో విద్యుదుత్పత్తి కేంద్ర ఏర్పాటు చకచకా జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ పత్తాలేకుండా పోయింది. 

అటకెక్కిన చెత్త సేకరణ
నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణను పాలకవర్గం విస్మరించింది. బడాబాబుల ఇళ్ల వద్ద మాత్రమే ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. దళితవాడలు, పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో చెత్త సేకరణ జరగడంలేదు. ఫలితంగా ఇళ్లలోనే చెత్తను వారాలు తరబడి నిల్వ చేసుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..   
వాస్తవానికి కార్పొరేషన్, మున్సిపాల్టీల పరిధిలో చెత్త సమస్య తీవ్రంగా ఉంటుంది. చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించడంతో కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోతోంది. ఫలితంగా డంపింగ్‌యార్డులకు సమీపంలో ఉండే వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. దీంతో చెత్తకు శాశ్వత పరిష్కారం దిశగా చెత్తతో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి కార్పొరేషన్లలో చెత్తతో విద్యుదుత్పత్తికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ ఏర్పాటు విషయమై అప్పటి కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందాలు జరిపారు. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు మున్సిపాల్టీల్లో రోజూ 400 టన్నుల మేర చెత్తను తరలించి తద్వారా విద్యుదుత్పత్తికి అడుగులు పడ్డాయి. దీంతో చెత్త సమస్యకు విముక్తి కలుగుతుందని ప్రజలు భావించినా నేటికీ అడుగులు పడలేదు.

చెత్త తరలింపులోనూ కక్కుర్తే  
నగరపాలక సంస్థ పరిధిలో ఉత్పత్తయ్యే చెత్తను దొంతాలి డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తుంటారు. టీడీపీ నేతలు బినామీ కాంట్రాక్టర్ల ద్వారా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ట్రాక్టర్లు నడుపుతున్నారు. రోజూ నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉండగా, రెండింటికే పరిమితం చేస్తున్నారు. టీడీపీ నేతల బినామీలు కావడంతో అధికారులు ప్రశ్నించే సాహసం చేయడంలేదు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 40 ఆటోలు, 4 ట్రాక్టర్లు, 14 లారీలు, 5 డంపర్‌ ప్లేసర్లు, ఏడు కాంపాక్టర్లు, 10 చిన్న కాంపాక్టర్లను వినియోగిస్తున్నారు. ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల నుంచి 18 ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లను వినియోగిస్తున్నారు. రోజుకు నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉండగా, రెండు, మూడుకే పరిమితమవుతోంది. అయితే రికార్డుల్లో మాత్రం నాలుగు ట్రిప్పులు వేసినట్లు లెక్కలు చూపుతున్నారు. ట్రాక్టర్‌ ఒక్క ట్రిప్పునకు రూ.690, టిప్పర్‌కు రూ.2150 మేర కార్పొరేషన్‌ చెల్లిస్తోంది. ప్రతి నెలా రూ.30 లక్షలను చెల్లించాల్సి ఉంది. ఈ రకంగా తప్పుడు లెక్కలు చూపి ప్రతి నెలా రూ.ఐదు లక్షలకు పైగా దోపిడీకి పాల్పడుతున్నారు.   

నెల్లూరు కార్పొరేషన్‌ జనాభా: దాదాపు 8 లక్షలు
డివిజన్లు: 54
పారిశుధ్య కార్మికులు: 1200
రోజూ ఉత్పత్తయ్యే చెత్త: 270 మెట్రిక్‌ టన్నులు
డంపింగ్‌ యార్డు: దొంతాలి
డంపింగ్‌ ట్రాన్సిట్‌ పాయింట్‌: బోడిగాడితోట  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement