- ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిన సీమాంధ్ర సిబ్బంది
- బంద్ వల్ల తెలంగాణ ఉద్యోగుల్లో కొందరే విధులకు హాజరు
- సచివాలయంలోనూ సెలవు వాతావరణం
- జారీ అయిన జీవోలు 28 మాత్రమే
సర్కారు కార్యాలయాలు వెల వెల
Published Sun, Sep 8 2013 4:56 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో సహా రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉద్యోగులు, సందర్శకులు లేక శనివారం వెల వెల బోయాయి. సీమాంధ్ర ఉద్యోగులందరూ నగరంలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరు కాగా, బంద్ కారణంగా తెలంగాణ ఉద్యోగుల్లో కొందరే విధులకు హాజరు కాగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మంత్రులెవరూ సచివాలయానికి రాలేదు. దీంతో ముఖ్యమంత్రి విధులు నిర్వహించే సీ బ్లాక్‌తో సహా అన్ని బ్లాక్‌లూ బోసిపోయాయి. సాధారణ పరిపాలన శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులందరూ సభకు తరలి వెళ్లిపోవడం విశేషం. దీంతో సీఎం కార్యాలయ అధికారుల పేషీలు సిబ్బంది లేక నిర్మానుష్యంగా మారాయి. సందర్శకులు కూడా శనివారం సచివాలయం వైపు కన్నెత్తి చూడలేదు.
దీంతో అరకొరగా హాజరైన తెలంగాణకు చెందిన ఉద్యోగులతో సచివాలయం సెలవు వాతావరణాన్ని తలపించింది. సచివాలయం నుంచి రోజుకు 300 వరకూ జీవోలు జారీ అవుతుంటాయి. విభజన ప్రకటన తరువాత వీటి సంఖ్య 150 నుంచి 200కు పడిపోయింది. శనివారం నాడు 28 జీవోలు మాత్రమే జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాత్రం సచివాలయం నుంచి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. రాజధానిలోని పాఠశాల విద్య డెరైక్టరేట్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, ఉన్నత విద్యా మండలి, ఇంటర్మీడియట్ బోర్డులలో సీమాంధ్ర ఉద్యోగులతోపాటు, డీజీపీ కార్యాలయంలోని మినిస్టీరియల్ సిబ్బంది కూడా సభకు తరలివెళ్లడంతో, ఆయా కార్యాలయాలు కూడా బోసిపోయాయి. వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషనరేట్లలోనూ సెలవు వాతావరణం నెలకొంది.
ఆరో రోజూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆరో రోజూ సమ్మె కొనసాగించారు. శనివారం ఉదయమే సచివాలయం చేరుకున్న ఉద్యోగులు కాసేపు నిరసన తెలిపారు. అనంతరం సచివాలయం నుంచి ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగే ఎల్బీ స్టేడియానికి ర్యాలీగా సాగారు. సచివాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కార్యదర్శి కె. వి కృష్ణయ్య నేతృత్వంలో వందలాది మంది సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సభలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement