హైదరాబాద్:డీజీపీ దినేష్ రెడ్డి రిటైర్మెంట్ నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో క్యాట్ ను ఆశ్రయించిన దినేష్ కు అక్కడా చుక్కెదురైంది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.
దీనిపై శుక్రవారం క్యాట్ తన తుది తీర్పు వెల్లడించింది. ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది. దినేష్ రెడ్డిని డీజీపీగా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్కు నివేదిక ఇవ్వడంతో ఆయన ఆశలకు గండిపడక తప్పలేదు. మరో ఏడాది పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు.
'ప్రకాష్ సింగ్ - భారత ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డీజీపీగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.