
ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి
ఎన్సీఎస్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, వారి ఆస్తులను విక్రయించి రైతుల బకాయిలు తీర్చాలని, ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని రెండు రోజుల్లో చెల్లించాలని
బొబ్బిలి: ఎన్సీఎస్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, వారి ఆస్తులను విక్రయించి రైతుల బకాయిలు తీర్చాలని, ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని రెండు రోజుల్లో చెల్లించాలని ఏపీ చెరుకు రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన, పోలీసులు అరె స్టు చేయడానికి ముందు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మొబలైజేషన్ నిధులను కాంట్రాక్టర్లకు ఇచ్చిన విధంగానే ఫ్యాక్టరీ ఆస్తులను తనవద్ద ఉంచుకొని అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. 1965 సుగర్ కంట్రోలు యాక్టు ప్రకారం ప్రభుత్వం అలా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ నెల 2న మహాధర్నా చేసినపుడు 5 నుంచి చెల్లింపులు చేస్తామని స్వయంగా సబ్ కలెక్టరే ప్రకటించి మూడో తేదీ నుంచే 144వ సెక్షను అమలులోనికి తెచ్చారంటే చెల్లింపులు జరగవన్న సంగతి అధికారులకు ముందే తెలిసి రైతులను మోసం చేశారా అని ప్రశ్నించారు. సబ్ కలెక్టరు స్థాయి అధికారి రైతులను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారని ఆరోపించారు.
ప్రభుత్వం చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు. నిత్యం రైతులను మోసం చేస్తున్న యాజమాన్యం వద్ద ఏ హామీ తీసుకొని రైతులకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇళ్లున్నాయి, నెల్లూరులో ఫ్యాక్టరీలున్నాయని అంటున్న అధికారులు వాటి స్వరూపం ఏమిటో, వాటిమీద ఎంత రుణం తీసుకున్నారో పరిశీలన చేశారా ? అని ప్రశ్నించారు. బిల్లుల కోసం 15 సార్లు ఆందోళన చేశామని, సబ్ కలెక్టరు వద్దే అంగీకరించి నాలుగు సార్లు వాయిదా వేశారని చెప్పారు. అధికారుల్లాగా అరుకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా యాజమాన్యంతో మాట్లాడి 5న బిల్లులు చెల్లిస్తారని భరోసా ఇచ్చారని, అలా కాకపోతే ఆరున ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారని అన్నారు. మరి బిల్లులు అందక రైతులు రోడ్డెక్కడంతో ఎంపీ ఏ రూపంలో ఉద్యమంలో పాల్గొంటారోనని నిరీక్షిస్తున్నామన్నారు.