భీమునిపాడులో మూతపడ్డ వయోజన విద్యాకేంద్రం
జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు ఉన్న ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం సాక్షరభారత్ పథకంలో ఎనిమిదేళ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మండల, గ్రామస్థాయికో ఆర్డినేటర్లను తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేసింది. ఉన్నఫలంగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆ పథక సమన్వయ కర్తలు లబోదిబోమంటున్నారు.
కోవెలకుంట్ల: 2010వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రామాల్లోని నిరాక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే పథకం ఉద్దేశం. ఇందుకు గ్రామస్థాయి కో ఆర్డినేటర్ (వీసీఓ)లను నియమింంచారు. జిల్లాలో 53 మండలాల పరిధిలో 889 గ్రామ పంచాయితీలు ఉండగా గ్రామానికి ఇద్దరు చొప్పున నియమించారు. నిరక్షరాస్యులకు చదువు చెబుతున్నందుకు వీసీఓలకు నెలకు రూ. 2వేలు గౌరవ వేతనం కేటాయించారు. అభ్యాసకులకు చదువు చెప్పడంతోపాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వయెజన విద్యాకేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. నెలల తరబడి గౌరవ వేతనం ఇవ్వకపోయినా వీసీఓలు ఊడిగం చేశారు. సాక్షరభారత్ పథకంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రచార కార్యకర్తలుగా కూడా వినియోగించుకున్నారు.
నిర్ధాక్షిణ్యంగా తొలగింపు: ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ఏడవ విడత సాక్షరభారత్ కార్యక్రమం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పథకం నిలిచిపోగా కర్నూలు జిల్లాలో మాత్రం కలెక్టర్ చొరవతో మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మూడు నెలలు వీసీఓలు ఎలాంటి వేతనం ఆశించకుండా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్ పథక ఎంసీఓలు, వీసీఓలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010వ సంవత్సరం నుంచి పనిచేయించుకుని ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండా తొలగించి తమ పొట్ట కొట్టారని వాపోతున్నారు.
కొత్తవారిని తీసుకునే రాజకీయ ఎత్తుగడ: సాక్షరభారత్ పథకంలో పనిచేస్తున్న ఎంసీఓ, వీసీఓలను తొలగించి వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసుకునేందుకు సర్కార్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోస్టులు కట్టబెట్టి రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కుట్ర పన్నుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. పనిచేస్తున్న వారిని తొలగించామన్న విమర్శ రాకుండా పథకాన్ని మార్పు చేసి ఎంసీఓ, వీసీఓల ఎంపికకు విద్యార్హత, వయస్సును పరిగణనలోకి తీసుకుని తమకు అనుకూలమైన వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తొలగించడం అన్యాయం
సాక్షరభారత్ పథకం ప్రారంభం నుంచి వీసీఓగా పనిచేస్తున్నాను. ఎనిమిది సంవత్సరాలపాటు పనిచేస్తే మమ్మల్ని తొలగించి అన్యాయం చేశారు. వందల మందికి చదువు నేర్పించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దితే ప్రభుత్వం మమ్నల్ని తొలగించి మా కుటుంబాలను రోడ్డున పడేసింది.– జర్మియ, ఎంసీఓ, దొర్నిపాడు
Comments
Please login to add a commentAdd a comment