సీమాంధ్ర నివేదికలా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక: కోదండరామ్
ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)కు ఇచ్చిన నివేదికలు సీమాంధ్రకు సంబంధించిన నివేదికల్లా ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండ రామ్ అన్నారు. ఆ నివేదికలు పూర్తి రాష్ట్రానికి సంబంధించిన నివేదికలులా లేవన్నారు. తెలంగాణ ప్రాంతం అనేక వివక్షలకు గురవుతూ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి సీమాంధ్రులకు అధికారాలు ఇస్తే రాష్ట్రం ఇచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పారు. తెలంగాణకే పూర్తి అధికారాలు దక్కాలని కోదండరామ్ కోరారు.
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ కూడా కోదండరామ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక కేవలం సీమాంధ్ర అవసరాలకే పరిమితమైందని విమర్శించారు. హెచ్ఎండిఏను కామన్ క్యాపిటల్ చేయాలనడంలో ఆంతర్యం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. దానివల్ల సీమాంధ్రులకు కలిగే ప్రయోజనం ఏంటి? అని అడిగారు.
ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.