![Government School Students Problems In Mid Day Meal Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/2/students.jpg.webp?itok=QmxiSHXC)
భోజనం కోసం ఎదురుచూస్త్ను విద్యార్థులు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటాయి. బుధవారం నిర్ణీత సమయానికి భోజనాలు పాఠశాలలకు చేరకపోవటంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఏలూరు, కాళ్ల తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పాఠశాలలో పెట్టవలసిన భోజనం నాలుగున్నర వరకు పెట్టకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 35 స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలె మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ఏక్తాశక్తి అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. డ్వాక్రా మహిళలు నిర్వహించే ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో డ్వాక్రా మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు.
మొదటి రోజునే ఇలా ఆలస్యం అవ్వడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశాయి.
భోజనం కోసం విద్యార్థుల ఎదురుచూపులు
తూర్పు గోదావరి : జిల్లాలోని అయినవిల్లి మండలంలోనూ మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ఎదురుచూపులు తప్ప లేదు. భోజన సమయానికి ఆహార పదార్థాలు పాఠశాలలకు చేరుకోకపోవటంతో వారు ఆకలితో అలమటించారు. పిల్లల బాధ చూడలేక ఉపాధ్యాయులే వారికి బిస్కట్లు, గుడ్లు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించటం మూలానే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment