కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :
గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్(ఆదర్శ)స్కూల్స్ వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండుడగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 12 వతరగతి వరకు సీబీఎస్‌ఈ బోధన సాగించడంతో పాటు బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించాలనే నిబంధన ఉత్తమాటే అయ్యింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు హాస్టల్ సదుపాయం లేదని ప్రభుత్వం చేతులేత్తేసింది. ఒక్కో పాఠశాలలో 6,7,8 తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో కలిపి 320 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.
బోధన కోసం ఒక ప్రిన్సిపాల్, 13 పీజీటీ, ఆరు టీజీటీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు పాఠశాలల్లో ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులను మాత్రమే భర్తీచేసి టీజీటీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఈ స్కూళ్లల్లో ప్రవేశాలు పొందిన 6,7,8, 11 వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ప్రారంభించిన 47 ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంత వరకూ స్లాబ్‌లు పూర్తయి గదుల నిర్మాణం జరగని పాఠశాలలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు టీజీటీల నియామకాలు ఇంత వరకు చేపట్టకపోవడంతో పీజీటీలపై తీవ్ర పనిభారం పడుతోంది. పాఠశాలల్లో 6,7,8 తరగతులను ఒక్కోదాంట్లో రెండు సెక్షన్లుగా విభజించగా.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో విద్యాబోధనకు పీజీటీలు సరిపోవడం లేదు. దీంతో ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతోంది. తరగతులను నెట్టుకవచ్చేందుకు ప్రిన్సిపాళ్లు తంటాలు పడుతున్నారు.
సిలబస్ ముందుకు సా గక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక పాఠశాలల్లో ప్రతి పాఠశాలకు ఒక వాచ్‌మెన్, అటెండర్, కం ప్యూటర్ అపరేటర్లను నియమించాల్సి ఉండగా ఇంత వరకు వాటి ఊసేలేదు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్ల నిర్వహణపై జిల్లా అధికారులు జాప్యం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడం తో పాఠశాలల్లో బెల్లుకొట్టడం, గదులు ఊడ్చడం వంటి పనులు విద్యార్థులతోనే చేయించే పరిస్థితి నెలకొంది.
ఈ ఐదు చోట్ల గందరగోళం
జిల్లాలో మొదటి విడతలో కాకుండా రెండో విడతలో ప్రవేశాలు కల్పించిన కరీంనగర్, బెజ్జంకి, ధర్మారం మండలాల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. జమ్మికుంట, మహాముత్తారంలో ప్రిన్సిపాల్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఈ మండలాల్లో ఇంత వరకు తరగతులు ప్రారంభించనే లేదు. ప్రిన్సిపాల్ పోస్టును మాత్రమే భర్తీ చేసి మిగతా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో అక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. బెజ్జంకి మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు దీక్షకు సైతం దిగాయి. ఈ ఐదు పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆదర్శ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు, భవన నిర్మాణ పనులవేగవంతం, టీజీటీ నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టేలా ఉన్నతాధికారులకు ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదర్శం.. అపహాస్యం
Published Tue, Nov 5 2013 6:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement