- ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల విద్యార్థులకు ఏపీ సర్కారు వరం
హైదరాబాద్: ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివే అన్ని మాధ్యమాల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే వీటి పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 450 ప్రభుత్వ జూనియర్, 150 ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోని 3 లక్షల మంది విద్యార్థులకు ఈ ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల ముద్రణలో సంస్కరణలు చేపట్టి మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండానే విద్యార్ధులకు లాభం చేకూరేలా ఇంటర్మీడియెట్ అధికారులు ప్రణాళికను రూపొందించారు.
ఇందులో భాగంగా ఇప్పటివరకు తెలుగు అకాడెమీ ద్వారా ప్రైవేటు పబ్లిషర్లు కొందరు కొనసాగిస్తున్న ముద్రణను ఇంటర్ బోర్డు రద్దు చేసింది. ఇక నుంచి నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డే ప్రైవేటు ప్రింటర్ల ద్వారా ముద్రణ చేయించి విద్యార్థులకు అందించనుంది. దీనికిగాను టెండర్ ప్రకటన కూడా విడుదలైంది. ఇప్పటి వరకు విద్యాహక్కు చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వ ఆర్థికసాయంతో పదో తరగతి వరకు ఉన్న విద్యార్ధులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ముద్రింపచేసి పంపిణీ చేయిస్తోంది. ఇంటర్మీడియెట్ పుస్తకాలను మాత్రం తెలుగు అకాడెమీ ద్వారా ముద్రింపచేసి విక్రయింపచేస్తోంది. ఇందుకు ప్రభుత్వం ఎలాంటి నిధులు చెల్లించదు. అధికారులు ఈసారి తెలుగు అకాడెమీ నుంచి ఈ ముద్రణ కార్యకలాపాలను తప్పించి నేరుగా టెండర్ల ద్వారా సామర్థ్యమున్న ప్రైవేటు ప్రింటర్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
'ఇంటర్' కు ఉచిత పాఠ్యపుస్తకాలు
Published Sat, May 9 2015 1:14 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement