సాక్షి ప్రతినిధి, విజయనగరం : కాపు నాయకులపైనే కాదు కాపు సామాజిక వర్గ అధికారులపైనా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గ అధికారులను అకారణంగా బదిలీ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. కాపు ఉద్యమానికి అంతర్గతంగా మద్దతిస్తున్నారని, ఆ నేతలతో సత్సంబంధాలు నెరుపుతున్నారని ప్రభుత్వానికి కన్ను కుట్టినట్టు ఉంది.
తమ చేతిలో ఉన్న బదిలీ అస్త్రాన్ని ప్రయోగించి అక్కసు వెళ్లగక్కుతోంది. ఇందుకు ఎక్సైజ్ శాఖ విజయనగరం డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి బదిలీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన ఎనిమిది నెలల్లోనే అర్ధంతరంగా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసేసింది. విజయనగరం డిప్యూటీ కమిషనర్‌గా ఇక్కడకు వచ్చిన దగ్గరనుంచి ఆదర్శంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ సైకిల్‌పైనే కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారు.
తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తన కార్యాలయంలో ఏసీలు వినియోగించరు. అదే కాకుండా జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. సారా నియంత్రణ కోసం నిర్వహిస్తున్న నవోదయం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇంతవరకు ఆయనపై ఎటువంటి ఏసీబీ కేసుల్లేవు. శాఖా పరమైన చర్యలు కూడా లేవు. కానీ కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నారు.
అందువల్లే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆయనకు బదిలీ ఉత్తర్వులొచ్చేశాయి. ప్రభుత్వానికి రిపోర్టు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తననెందుకు బదిలీచేశారో తెలీదని, తనపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ఇప్పటికే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాననీ, ఇంతలోనే బదిలీ విషయం తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు.
కక్ష సాధింపా?
Published Tue, Jun 21 2016 11:22 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement
Advertisement