
పేదింటి కల సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేస్తూ.. వచ్చే ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు అందివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాజధాని నగరం విజయవాడలోనే దాదాపు లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికోసం వెయ్యి ఎకరాలు స్థలం అవసరం అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలపై ఇప్పటికే సర్వే చేపట్టారు.
సాక్షి, విజయవాడ : వచ్చే ఉగాది నాటికి పేదింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే 25లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు విజయవాడ నగరానికి కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ లక్ష ఇళ్లు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. కాగా నగరంలో ఇప్పటికే సుమారు 1.25లక్షల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వెయ్యి ఎకరాల స్థలం సేకరణ..
విజయవాడలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి ఇళ్లనే నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. వెయ్యి ఎకరాలు స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఎకరంలోనూ జీ+3 పద్ధతిలో 100 ఇళ్లు నిర్మిస్తారు. ఈ లెక్కన వెయ్యి ఎకరాల్లోనూ లక్ష ఇళ్లు నిర్మాణం జరుగుతుంది.
నగర పరిసర ప్రాంతాల్లో..
అయితే నగరంలో వెయ్యి ఎకరాలు సేకరణ సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామవరప్పాడు, జూపూడి, అంబాపురం, జక్కంపూడి, నున్న, గొల్లపూడి తదితర గ్రామాల్లో అన్వేషిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని గుర్తించి.. అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతారు. లేకపోతే రైతుల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
రూ.వెయ్యి కోట్లు వ్యయం..
ప్రస్తుతం విజయవాడ చుట్టు పక్కల గ్రామాల్లో కనీసం రూ.కోటి పెట్టందే ఒక ఎకరా పొలం లభించదు. అందువల్ల వెయ్యి ఎకరాలు కొనుగోలు చేయాలంటే కనీసం వెయ్యి కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు, నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే అధికారులు మూడు సమావేశాలు నిర్వహించి, భూముల లభ్యత గురించి చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment