ఇళ్ల పట్టాల పంపిణీకి ఇంటింటి సర్వే  | Government Is Working To Distribute Home Rails To All The Poor People In The District | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల పంపిణీకి ఇంటింటి సర్వే 

Published Sat, Aug 24 2019 9:43 AM | Last Updated on Sat, Aug 24 2019 9:43 AM

Government Is Working To Distribute Home Rails To All The Poor People In The District - Sakshi

అర్హతలు 
లబ్ధిదారుకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి.  
2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలలోపు మెట్ట భూమి. 
పట్టణాల్లో రూ. 3 లక్షల్లోపు వార్షిక ఆదాయం 

సాక్షి, అనంతపురం: జిల్లాలో ఇళ్లులేని పేదలందరికీ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వలంటీర్లు సేకరించిన జాబితాను ఇప్పటికే రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ అధికారుల వద్దనున్న సమాచారంతో సరిపోల్చుకోవడంతో పాటు సంబంధిత తహసీల్దార్లు, కమిషనర్లు రీ–వెరిఫికేషన్‌ చేస్తారు. అనంతరం సెప్టెంబర్‌ 3 నుంచి 10వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ, వార్డుల్లో అర్హులైన జాబితాను ప్రకటిస్తారు. అదేవిధంగా దీనిపై అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు పరిష్కరించే పనిని తహసీల్దార్లు, కమిషనర్లు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికి తుది జాబితాను కలెక్టరుకు అందజేయాలి. ఆ తర్వాత కలెక్టర్‌ అనుమతితో అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. ఇందుకోసం జిల్లాలోని మొత్తం 20,050 మంది వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.  

ఎంపిక ఇలా...! 
జిల్లాలోని మొత్తం 1,029 పంచాయతీలు ఉండగా.. 15,006 మంది గ్రామ వలంటీర్లు.. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల్లో మొత్తం 373 వార్డులు ఉండగా 5,044 మంది వార్డు వలంటీర్లు నియమితులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 20,050 మంది వలంటీర్లు ఈ సర్వేలో పాల్పంచుకోనున్నారు. ఒక ఫారంలో సర్వే చేసిన సంబంధిత కుటుంబం గురించి పేర్కొన్న వివరాలన్నీ సరైనవేనంటూ సదరు ఇంటి యజమానితో పాటు వలంటీరు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలపై మరోసారి తహసీల్దారు ఆధ్వర్యంలో విచారణ చేపడతారు. ఆయా పంచాయతీలు, వార్డుల్లో జాబితాను సెప్టెంబర్‌ 3 నుంచి 10వ తేదీ వరకు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలను, క్‌లైయిమ్‌లను స్వీకరించి పరిష్కరిస్తారు. అనంతరం తుది జాబితాను ఆమోదం కోసం సెప్టెంబర్‌ 15 నాటికి కలెక్టర్‌కు పంపనున్నారు.  

ప్రస్తుత లెక్కలు ఇవీ...! 
జిల్లాలో ఇప్పటివరకు ఇళ్ల పట్టాల కోసం 1,40,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక విచారణలో 1,20,712 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. వీరందరికీ ఇళ్ల పట్టాలను కేటాయించేందుకు 4,082.53 ఎకరాల భూమి అవసరం కాగా.. 1077.25 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ భూమిని 29,259 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు సాధ్యమవుతుంది. మిగిలిన 97,453 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు మరో 3,010.68 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం మొత్తం రూ.716.49 కోట్లు అవసరం అవుతుందని జిల్లా అధికారులు లెక్కకట్టారు. అయితే, తాజాగా మళ్లీ ఇళ్ల పట్టాల కోసం అర్హులైన వారి కోసం ఇంటింటి సర్వేతో తుది లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. అంతేకాకుండా గతంలో గంపగుత్తగా మండలాల వారీగా లెక్కలు తీసుకోగా.. తాజా సర్వేలో పంచాయతీల వారీగా భూమి లభ్యత, అర్హుల జాబితాను రూపొందించనున్నారు. ఈ దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే ఇంటి స్థలం దక్కనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి వచ్చే ఏడాది ఉగాది పర్వదినాన పట్టాల పంపిణీ ప్రారంభంకానుంది. మొత్తం మీద జిల్లాలో ఇళ్లపట్టాలు లేని వారికి త్వరలోనే ఇంటిపట్టా చేతికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

సెప్టెంబర్‌ 15 నాటికి ప్రక్రియ పూర్తి  
జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు అర్హులై జాబితాను రూపొందించేందుకు 26వ తేదీ నుంచి వాలంటీర్లు సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్‌ 15 నాటికి పూర్తి అవుతుంది. ప్రధానంగా సంబంధిత పంచాయతీలోనే ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే దిశగా పక్కాగా చర్యలు తీసుకుంటాం. 
– డిల్లీరావు, ఇన్‌చార్జి కలెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement