ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు
అమరుల స్థూపాల సాక్షిగా వామపక్ష నేతల హెచ్చరిక
యడ్లపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పలువురు వామపక్ష నాయకులు హెచ్చరించారు. మండలంలోని తుమ్మలపాలెం వద్ద ఉన్న అమర్‌నగర్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుధవారం సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల సమాధులపై పూలు చల్లి, మృతవీరులకు నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది రావిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ధ్వజం ఎత్తారు.
మరోమారు ఉద్యమబాట పట్టక తప్పదంటూ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘మేక్ ఇండియా’ ప్రకటనలకే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య విమర్శించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానని, లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టిస్తానంటూ చెప్పిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పాలనను కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణకు సిద్ధం అవుతున్నాయన్నారు.
దేశాన్ని అమ్మేస్తున్నారు!
భారతదేశం ఒకప్పుడు తాకట్టులో ఉండేదని, ఇప్పుటి పాలకులు ఏకంగా అమ్మేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ అన్నారు. చంద్రబాబు దృష్టి బాకై ్సట్ ఖనిజాలున్న విశాఖపట్నం పైనే తప్ప ,దాని చుట్టూ ఉన్న అడవి బిడ్డలపై లేదన్నారు. 270 గిరిజన గ్రామాలు పొలవరంలో ముంపునకు గురైతే వారికి పునరావాసం కల్పించలేదన్నారు. కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు రావాలని సీపీఐ చిలకలూరిపేట డివిజన్ ఏరియా కార్యదర్శి సీఆర్‌మోహన్ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలకు కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.ప్రస్తుత సమాజంలో దోపిడీ తీరు మారిందని, అందుకనుగుణంగా ఉద్యమాల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు శివయ్య అన్నారు.