పాపం... పెద్దాయనకు ఎన్ని ఇబ్బందులో!
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రాసిచ్చిన పచ్చి అబద్ధాలు చదవలేక పాపం.. పెద్దాయన గవర్నర్ చాలా ఇబ్బందులు పడ్డారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్రం యావత్తు చూసిందని, చంద్రబాబు రాసి ఇచ్చిన అవాస్తవాలు, అబద్ధాలు చెప్పలేక ఆ పెద్దాయన పడిన ఇబ్బందులు, అవస్థలు, ఆపసోపాలు మా కళ్లతో అసెంబ్లీలో చూశామని అన్నారు. ఇన్ని అబద్ధాలు చదవలేనంటూ నాలుగైదు సార్లు నీళ్లు తాగారని, దాన్నిబట్టే ఆయన మానసికంగా ఎంత నలిగిపోయారో కనిపించిందని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అభూకతల్పనలు, అవస్తవాలు, అరిచేతిలో స్వర్గం, వైకుంఠం చూపించారని అన్నారు. తొలి సంతకంతో రైతుల రుణమాఫీ అన్నారు, ఎక్కడా కనిపించడంలేదని, ఇంటికో ఉద్యోగం ఎక్కడికెళ్లిపోయిందో తెలియదని చెప్పారు. అయితే.. ఒక్క ఇంట్లోనే ముగ్గురు బాబులకు ఉద్యోగం ఇప్పించిన ఘనత చంద్రబాబుదేనని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దబాబు చంద్రబాబు, మధ్యబాబు బాలయ్య, చిన్నబాబు లోకేష్ ముగ్గురికీ పదవులు ఇచ్చారని, ఇక ఆ కుటుంబంలో మిగిలింది బుల్లిబాబు దేవాన్ష్ ఒక్కడేనని అన్నారు.
ఒక కేసు లోంచి బయటపడేందుకు పదేళ్లు హక్కున్న రాజధాని నుంచి వచ్చేశారని, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర పాలనను, అభివృద్ధిని ఎక్కడకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆలీబాబా 40 దొంగలని విన్నామని, ఇప్పుడు చంద్రబాబు పక్కన ఉన్న 40 మందిలో ఒక్క మంత్రికైనా సబ్జెక్టు మీద అవగాహన ఉందా అని నిలదీశారు. వృథా మంత్రులను పెట్టుకుని వృథా పాలన జరుగుతోందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అర్థమయ్యే ఏకైక భాష బూతు భాష అని, అందులో చెబితేనే ఆయనకు అర్థమవుతుందని మండిపడ్డారు. ఆయన భాషలో సమాధానం చెప్పాలంటే తాము కూడా దిగజారాలన్నారు.