హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన హేతుబద్ధంగా జరగలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని... కేంద్రం నుంచి మరింత సహకారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ప్రకృతి వైపరిత్యాల వల్ల ఏపీకి మరింత నష్టం జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అన్నారు.
9 నెలలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటం తమ విభజన వల్ల జరిగిన నష్టాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉండాలన్నారు. జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి చేస్తామన్నారు.