
హస్తిన బయల్దేరిన నరసింహన్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ, రేపు హస్తినలో మకాం వేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలు అంశాలపై ఆయన మంతనాలు జరపనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత నరసింహన్ తొలిసారి హస్తినకు వెళుతున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు పాలనాపరంగా తాను తీసుకోదలచుకున్న చర్యలను రాష్ట్రపతికి గవర్నర్ నివేదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే పాలనాపరంగా సహకరించేందుకు సలహాదారులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల పదవీ విరమణ చేసిన రాష్ట్రేతర అధికారులను నియమించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా గవర్నర్... కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.