సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విజయవాడలో రాజ్‌భవన్‌గా ఖరారు చేసిన ఇరిగేషన్ శాఖ భవనాన్ని జీఏడీ ముఖ్య కార్యదర్శి సిసోడియాతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు వస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. 24వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు.
అనంతరం మంత్రి మండలి, శాసనసభ సభ్యులతో గ్రూప్ ఫొటో వంటి కార్యక్రమాలు ఉంటాయి. విజయవాడలో ఇరిగేషన్ శాఖ భవనంలోని మొదటి అంతస్తును గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ భవనంలో ఒక దర్బార్ హాల్, ఒక మీటింగ్ హాల్, మరో ఏడు గదులు అందుబాటులో ఉంటాయన్నారు. భద్రత పరంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గవర్నర్ కార్యాలయానికి సంబంధించి తెలంగాణ నుండి కొందరు అధికారులు, ఉద్యోగులు వస్తారని, మిగిలిన వారిని ఇక్కడి విభాగాల నుండి తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment