
సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా గుంటూరు జిల్లా వాసి చింతల గోవింద రాజులు ఎన్నికయ్యారు. ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా మొత్తం 31 మంది ఈ పదవికి పోటీ పడగా ప్రస్తుతం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గోవింద రాజులును బ్యాంకుల బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలోని బ్రాహ్మణకోడూరు ఆయన స్వగ్రామం. గుంటూరు నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (అగ్రీ), ఎంఎస్సీ (అగ్రానమీ) చదివారు.
ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సీడ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్ బీ అధికారిగా క్యాంపస్ రిక్రూట్ అయ్యారు. 35 ఏళ్లుగా నాబార్డ్‌లో వివిధ హోదాలలో పని చేశారు. నాబార్డ్ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా పాటు పడతానన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. నాబార్డ్ అందించే పథకాలలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట వేసేలా ఏమేమి చేయవచ్చో అదంతా చేస్తానని, నిరుపేదలను అభివృద్ధి పథకాలలో భాగస్వాములను చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment