
అయ్యో... రామా!
♦ రామతీర్థం దేవస్థానం అభివృద్ధిపై శీతకన్ను
♦ అమలుకు నోచుకోని సర్కారు హామీలు
♦ వచ్చిన నిధుల వినియోగంపైనా నిర్లక్ష్యం
♦ పాలకమండలి లేక పర్యవేక్షణ కరువు
♦ అనాథలా వదిలేసిన పాలకులు
♦ దేవస్థానానికి వచ్చే సరకులపైనా పరిశీలన కరువు
రామతీర్థం... ఉత్తరాంధ్ర భద్రాద్రిగా వినుతికెక్కింది. భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. కానీ పాలకుల కరుణకు నోచుకోలేకపోతోంది. రాష్ట్ర విభజనానంతరం భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోగా... సర్కారు పరంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడే జరపాలని నిర్ణయించినా... చివరి దశలో ఒంటిమిట్టకే ఆ అవకాశం దక్కింది. ఇక్కడా సర్కారు ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నా... అభివృద్ధి విషయంలో పట్టించుకోకపోవడం... పాలకమండలి ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యంతో ఆలయాన్ని అనాథలా వదిలేశారన్న భావన వ్యక్తమవుతోంది.
నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే రామతీర్థానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికి దాదాపు రూ. రెండు కోట్లకు పైగానే ఆలయానికి ఆదాయం వస్తుంది. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రా భద్రాద్రిగా చరిత్రకు ఎక్కాల్సిన సమయంలో వివిధ కారణాలతో ఒంటిమిట్టకు ఆ అవకాశం వెళ్లిపోయింది. అయినప్పటికీ ఒంటిమిట్ట రామాలయం మాదిరిగా రామతీర్థంలోనూ అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు.
అమలుకాని హామీలు...
మొదటిసారి శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రూ. కోటి 70లక్షలతో దేవస్థానం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ కేవలం రూ. 50లక్షలు మాత్రమే కేటా యించారు. వీటితో రాజగోపురం, శాండ్‌బ్లాస్టింగ్, పుష్కరఘాట్ల అభివృద్ధి, తదితర పనులు చేపడుతున్నారు. అయితే అవీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల అరకొరగానే ముగించేస్తున్నారు. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక సిబ్బంది అడ్డగోలు నిర్ణయాలతో క్షేత్ర అభివృద్ధి జరగడం లేదంటూ స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిబ్బంది మద్య భేదాభిప్రాయాలు
రామతీర్థం దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బంది మధ్య సయోధ్య కానరావడంలేదు. ఒకరిపై ఒకరికి పడకపోవడం... ఇక్కడ జరిగే విషయాలపై పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు కూడా సీరియస్‌గా వ్యవహరించకపోవడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే వారి బాగోగులు చూసే వారే కరువయ్యారు. ఇక్కడ సిబ్బంది, అధికారుల వైఖరి కారణంగానే దాతలు కూడా ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విధి నిర్వహణలో అలసత్వం, ఆలయ అభివృద్ధికి అధికారగణంలో చిత్తశుద్ధి కరువైంది. మారిన పరిస్థితులను బట్టి పాలక మండలి కూడా ఇప్పటికీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చేవి నాసిరకం సరుకులే
రామతీర్థానికి నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ, స్వామివారి భోగం తదితర వాటికి వస్తున్న సరుకులు చాలావరకూ నాసిరకంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. సరఫరా చేస్తున్న పప్పు దినుసులు కొద్ది కాలంలోనే పురుగులు పడుతుండడంతో అక్కడి సిబ్బంది తరచూ వాటిని ఎండలో ఆరబెడుతున్నారు. టెండరు ఖరారు చేసుకున్నప్పుడు సంబంధిత వ్యాపారి చూపించిన శాంపిల్స్‌కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న సరుకులకు చాలా తేడా కనిపిస్తోందని ఆలయ వర్గాల వారే చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా... ఆ వ్యాపారిని హెచ్చరించిన పాపాన పోలేదు. ఈ ఉదంతం బయటకు పొక్కడంతో దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం మేల్కొని ఉన్న సరుకులను బాగు చేసినట్లు, పాడైపోయిన సరుకులను కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాలపై ఆలయ సిబ్బందిలో సమన్వయలోపమే కారణంగా స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్న రామక్షేత్రం అభివృద్ధికి పాటు పడాలని ఉన్నతాధికారులు కూడా నిత్యం పర్యవేక్షణ జరపాలని భక్తులు కోరుతున్నారు.