
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వరుసగా ధర్మ పోరాట దీక్ష, ఆడపిల్లకు అండగా నిలుద్దాం, వక్ఫ్ బోర్డు కార్యాలయం శంకుస్థాపన, మహానాడు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మూడురోజుల పాటు జరిగిన మహానాడు ముగిసిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో శనివారం విజయవాడలో నవ నిర్మాణదీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రే స్వయంగా హాజరవుతుండటంతో తగిన ఏర్పాట్లు చేయడం, జనాన్ని తరలించలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్కన ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లా కలెక్టర్ సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లవద్దని ఆదేశించారు.
ఈ సమయంలో బందరు రోడ్డులో ఆరుబయట నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటంపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బందరు రోడ్డులో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ను నిలిపివేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. ఎండల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చునే వేదిక వద్ద మాత్రం ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశానికి వచ్చే అధికారులు, దీక్షకు తరలించే ప్రజలు, స్కూల్ వివిద్యార్థులు మాత్రం ఎండలో మాడిపోక తప్పదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నవ నిర్మాణ దీక్షకు జనాన్ని తరలించటంపై అధికారులకు ఇప్పటికే టార్గెట్లు విధించారు. జిల్లాల్లో కూడా వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు, పింఛనుదారులను తరలించి రుణాలు, పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు లాంటివి ఈ సందర్భంగా నిర్వహించాలని పేర్కొంది.
నేడు వాహనాల మళ్లింపు
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జూన్ 2వతేదీన æసనిర్వహిస్తున్న నవనిర్మాణదీక్ష సందర్భంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
భారీ వాహనాలు, లారీల మళ్లింపు ఇలా...
- విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి–తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా మళ్లించారు.
- హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లించారు.
- విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచిగుడివాడ– పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు.
- చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖకు వెళ్లే వాహనాలను ఒంగోలు–బాపట్ల–అవనిగడ్డ–చల్లపల్లి–పామర్రు–గుడివాడ–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖకు మళ్లిస్తారు.
- హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–నల్గొండ, మిర్యాలగూడ–పిడుగురాళ్ల–అద్దంకి–మేదరమెట్ల ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు.
- చెన్నై నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను ఒంగోలు–మేదరమెట్ల–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్గొండ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు.
- హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు మళ్లిస్తారు.
- గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు.
- మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మచిలీపట్నం–పామర్రు–హనుమాన్‌జంక్షన్ నుంచి మైలవరం–ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు.
- హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలను హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్‌జంక్షన్–మచిలీపట్నం మీదుగా మళ్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment