వెల్లంపల్లిలో నివాస గృహాలను జేసీబీతో కూల్చేస్తున్న దృశ్యం
మాచవరం (గురజాల) : గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెల్లంపల్లిని ఖాళీ చేసేందుకు ఇచ్చిన 2 రోజుల గడువు పూర్తయిందని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రాజెక్టు అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు ముంపు నిర్వాసితులను ఆదేశించారు. త్వరలో పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున, గ్రామాన్ని సత్వరమే ఖాళీ చేయించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆదివారం జేసీబీతో గ్రామంలోని ఇళ్లను తొలగించేందుకు యత్నించారు. పరిహారం అందజేసిన నిర్వాసితుల ఇళ్లకు మార్కింగ్ ఇచ్చామని, వీటిని ఆదివారంలోగా ఖాళీ చేయకుంటే కూల్చేస్తామని శనివారం ప్రకటించారు. గడువు కోరినా అధికారులు స్పందించకపోవడంపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం జేసీబీతో ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా గడువు విధించి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే ఎలాగని అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పరిహారం అందిన వారి ఇళ్లను కూల్చివేస్తున్నామని, పరిహారం అందని వారికి కొంత గడువు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇళ్లను కూల్చేయక ముందే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాన్ని ఖాళీ చేసేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో.. పరిహారం అందిన వారు సోమవారం సాయంత్రంలోగా ఖాళీ చేయాలని, లేకుంటే మంగళవారం ఉదయాన్నే యంత్రాలతో కూల్చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. పరిహారం అందని వారు నష్టపరిహారం అందేవరకూ ఇక్కడ ఉండవచ్చని తెలిపారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ధనుంజయ్, స్థానిక తహసీల్దారు మస్తాన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment