ఇంటి ముంగిటే పంట కొనుగోలు | Grain collection With Electronic Crop Registration | Sakshi
Sakshi News home page

ఇంటి ముంగిటే పంట కొనుగోలు

Published Sun, Apr 5 2020 2:47 AM | Last Updated on Sun, Apr 5 2020 5:23 AM

Grain collection With Electronic Crop Registration  - Sakshi

సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్‌ పంట నమోదు (ఇ–క్రాప్‌ బుకింగ్‌) ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇ–పంట విధానంతో రైతుల ఇళ్ల ముంగిటే సేవలందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇ–క్రాప్‌ డేటాతో ధాన్యాన్ని సేకరించడం ఇదే తొలిసారి.

విధివిధానాలు ఇలా ఉన్నాయి...  
► ఇ–క్రాప్‌ బుకింగ్‌లో ఆయా గ్రామాల్లోని రైతులు ఏఏ పంటలు వేశారో ఇప్పటికే నమోదు అయింది. 
► వరి పంట వేసిన రైతులు తమ గ్రామ స్థాయిలోనే ధాన్యం అమ్మకానికి పేర్లను నమోదు చేయించుకోవాలి. 
► గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకులు కొనుగోలు కేంద్రం తరఫున రైతుల పేర్లను నమోదు చేస్తారు. వేరే గ్రామం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊళ్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రబీ డేటా ఆధారంగా కొనుగోళ్లు చేపడతారు. 
► ప్రస్తుత ఇ–క్రాప్‌ బుకింగ్‌ విధానంలో వ్యవసాయ సహాయకులు సర్వే నంబర్‌ వారీగా తనిఖీ చేసి సాగుదార్ల వివరాలను నమోదు చేసినందున కొనుగోళ్లు సుళువవుతాయి. ఇ–క్రాప్‌ బుకింగ్‌ డేటాను పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. ఏవైనా ఫిర్యాదులు, అభ్యర్థనలు వస్తే పరిశీలించి అర్హత కలిగిన వారిని కూడా ఇ–క్రాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.  
► వెబ్‌ల్యాండ్‌లో లేని భూములను కూడా పరిశీలించి వాటిలో వరి సాగు చేసి ఉంటే ఆ రైతుల వివరాలను కూడా ఇ–క్రాప్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ధాన్యం కొనుగోళ్ల కార్యక్రమం సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇదే ప్రక్రియను మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా వినియోగించనున్నారు. ఈ విధానాన్ని శనగలకు అమలు చేసి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది.

గ్రామ స్థాయిలోనే జొన్న,మొక్కజొన్న సేకరణ
లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించే వరకు జొన్న, మొక్కజొన్న పంటల ఉత్పత్తులను గ్రామ స్థాయిలోనే సేకరించాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయం తీసుకుంది. మండల కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో  రైతులు అనేక వ్యయప్రయాసలకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ సిబ్బందికి కొనుగోలు కేంద్రాల్లోని విధులు అప్పగించనున్నారు. ఈ నెల పదో తేదీలోపు వీటిని ప్రారంభించేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకుంటోంది.  

► రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ఆ గ్రామ పరిధిలోని పంచాయతీ కార్యాలయం, పాఠశాల, ఆలయాల ప్రాంగణాల్లో తాత్కాలికంగా నిల్వ చేస్తారు. 
► నాలుగైదు రోజులయ్యాక ఆ పంటను ప్రభుత్వం కేటాయించిన గోడౌన్లకు తరలిస్తారు. 
► పంట కొనుగోలు, గోనె సంచుల్లో నిల్వ, తూకం తదితర పనులకు గ్రామాల్లో ధాన్యం వ్యాపారుల వద్ద పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులనే వినియోగించనున్నారు. 
► పంట సేకరణ బాధ్యతను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నారు.  
► రాష్ట్రంలో 1.88 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. దాదాపు 14.60 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 
► ప్రభుత్వం క్వింటాకు రూ.1760ను మద్దతు ధరగా ప్రకటించింది. రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్‌ టన్నులను మార్క్‌ఫెడ్‌ సేకరించనుంది. 
► రాష్ట్రంలో 1.10 లక్షల హెక్టార్లలో జొన్న పంటను రైతులు సాగు చేశారు. దాదాపు 4.33 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వచ్చే వీలుందని అంచనా.  
► ప్రభుత్వం క్వింటాకు రూ.2550లను మద్దతు దరగా ప్రకటించింది. 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరిస్తారు.  
► కొనుగోలు కేంద్రాల సంఖ్యను ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement