విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ధాన్యం ఉత్పత్తులు గత ఏడాది కన్నా తగ్గుముఖం పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న సమయంలో వర్షాలు కురవకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే వ్యవసాయ అధికారులు పౌరసరఫరాల శాఖాధికారులకు సూత్రప్రాయంగా తెలియజేశారు. దీంతో రేషన్ బియ్యం సరఫరా కోసం జిల్లాలోని ఉత్పత్తులు సరిపోతాయా లేదోనన్న విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గత ఏడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నులు ఇతర జిల్లాలకు తరలిపోయాయి. రైతుల అవసరాల కోసం 15నుంచి 20వేల మెట్రిక్ టన్నుల వరకూ జిల్లాలో భద్రపరుచుకున్నారు. వ్యాపారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ద్వారా 2,82,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
అంచనా తారుమారు: అయితే ఈ ఏడాది జిల్లాలో పంటల ఉత్పత్తి కేవలం 2.20 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని సాగు విస్తీర్ణం ద్వారా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇది ప్రారంభంలో పడిన వర్షాలకనుగుణంగా వేసిన అంచనా. కానీ ప్రస్తుతం జిల్లాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవలేదు. దీంతో వ్యవసాయాధికారులు వేసిన అంచనాల కన్నా ఉత్పత్తులు తగ్గే పరిస్థితి నెలకొంది. దీని వల్ల జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే బియ్యంపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల వంటి పలు అవసరాలకు పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో బియ్యం సరఫరా చేపడతున్నారు. ఇందుకోసం ఆయా కార్యాలయాలకు ప్రతి నెలా 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంది. ఈ లెక్కన సంవత్సరానికి 1,68,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంటుంది. ఈ బియ్యం రావాలంటే 2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం పడతాయి. అయితే అంత ఉత్పత్తి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వ్యాపారులకు సహకరిస్తున్న చట్టం ఎత్తివేత : ధాన్యం, బియ్యం నిల్వల నియంత్రణ చట్టాన్ని ఇటీవలే ఎత్తివేశారు. దీంతో వ్యాపారులకు అక్రమ నిల్వలకు మరింత ఊతం లభించింది. వ్యాపారులు ధాన్యం, బియ్యాన్ని అపరిమితంగా నిల్వ చేసుకుంటూ రిజిస్టర్‌ను నిర్వహించుకుంటే సరిపోతుందన్న జీఓ ఇటీవలే విడుదల కావడంతో వ్యాపారులకు అడ్డులేకుండా పోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వ్యాపారులకు ప్రభుత్వం ఇతోధికంగా సహకరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే చిల్లర వర్తకులుగా గుర్తించి 50 క్వింటాళ్ల వరకూ బియ్యం నిల్వలు తమ వద్ద ఉంచుకోవచ్చు. అదే పట్టణ పరిధిలో అయితే 250 క్వింటాళ్ల వరకూ ఉంచుకోవచ్చు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు పెంచుకునే పరిస్థితి నెలకొంది. వివిధ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యం నిల్వలను వ్యాపారులు ఇప్పటినుంచే పెంచుకునేందుకు యత్నిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి
ధాన్యం ఉత్పత్తులకు ప్రతికూలం కడుపు నిండదా?
Published Mon, Sep 7 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement