శిక్షణలో పాల్గొన్న వాలంటీర్లు
సాక్షి, ఏలూరు : ప్రజలంతా నవ్వుతూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త విధానం అమల్లోకి తెచ్చారు. పథకాలు ప్రతి ఇంటికీ అందా లనే సదుద్దేశంతో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అనుకున్నదే తడవుగా యుద్ధప్రాతిపదికన నియామకాలూ చేపట్టారు. ప్రస్తుతం వలంటీర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఉత్సాహంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నేరుగా ప్రజల ఇంటికే వెళ్లి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ పార్టీ నేతలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవి. జన్మభూమి కమిటీల్లోనూ తెలుగుదేశం నేతలే ఉండేవారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం ఓ పక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ.. నేరుగా ప్రజలందరికీ పథకాలు చేరాలనే లక్ష్యంతో వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారు.
విశేష స్పందన
వలంటీర్ల పోస్టులకు జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 8,29,130 గృహాలను పంచాయతీ అధికారులు గుర్తించారు. ఈ గృహాలకు పథకాలను డోర్‌డెలీవరీ చేయాలంటే 16,330 మంది వలంటీర్లు అవసరమని ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 16,294 మందిని ఎంపిక చేసి వారికి నియామకపత్రాలు అందించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 36 మందికి ఇంకా నియామక పత్రాలు అందించాల్సి ఉంది. అర్హులైన ఎస్టీ అభ్యర్థులు లేకపోవడం వల్ల 36 వలంటీర్ల పోస్టులను ఖాళీగా ఉంచారు.
ప్రత్యేక శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అం దించడంతోపాటుగా సోమవారం నుంచి ప్రత్యే క శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి గ్రామస్థాయిలో ఏమేర సేవలు అందించాలనే అంశంపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. జిల్లాలో 48 మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అభ్యర్థుల్లో హర్షం
నియామకపత్రాలు పొంది శిక్షణకు హాజరవుతున్న నిరుద్యోగ యువత సర్కారు వినూత్న ఆలోచనపై హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్నోఏళ్లుగా విద్యనభ్యసించి ఖాళీగా ఉంటున్నామని, తమలాంటి వారికి ఇలా ఉద్యోగావకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందని వలంటీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ వలంటీర్లు అందించే సేవలు, విధులివే..
నెలవారీ సేవల్లో పింఛన్లు, రేషన్ పంపిణీ, ఇమామ్, మ్యూజిన్లు, చర్చి పాస్టర్లకు నెలవారీ వేతనాల పంపిణీలో భాగస్వాములు కావాలి. వార్షిక సేవల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, అమ్మఒడి ప్రయోజనం అందజేత, రైతు భరోసా, చేతివృత్తిదారులకు అందించే ఆర్థిక సహాయం, చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతోపాటు ఇతరత్రా సేవలను అందించాలి. వీటితోపాటు అర్హులతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయించడం, అవి వచ్చేలా అధికారులతో సమన్వయం చేసుకోవడం చేయాలి. స్థానికుల సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తూ ఉండాలి.
ఆనందంగా సేవలందిస్తాం
ప్రజలకు సేవలందించేందుకు వలంటీరుగా బాధ్యతలు స్వీకరించా. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి ఉద్యోగంలో స్థానం లభించడం ఎంతో ఆనందగా ఉంది. ప్రభుత్వం సూచించిన మేరకు ఆనందంగా విధులు నిర్వహిస్తాను. సంతోషంగా సేవలు అందిస్తాను. – ఎం.నాగలక్ష్మి, గార్లమడుగు
ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తా
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం, ఆ అవకాశం నాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. బాధ్యతతో ప్రజలకు సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాను. – సాయిరామలింగేశ్వరరావు, బాపిరాజుగూడెం
Comments
Please login to add a commentAdd a comment