యాదగిరికొండ, న్యూస్‌లైన్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ మండపాన్ని అనేక రకాల పుష్పాలతో సర్వాంగ సందరంగా తీర్చిదిద్దారు. ముందుగా గజవాహన సేవలో స్వామి అమ్మవార్లను అధిష్టింపచేసి ఆలయ తిరువీధులలో ఊరేగుతూ బాజా బజంత్రీలు, వేద పండితులు, ఆలయ అర్చకులు చదివే వేదనాదాల నడుమ కల్యాణ మండపానికి తీసుకువచ్చారు.
స్వామి అమ్మవార్లకు దేవస్థానం తరఫున ఆలయ ఈఓ కృష్ణవేణి, చైర్మన్ బి.నరసింహమూర్తి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి తరఫున దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, స్వామి వారి తరఫున నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, ఇద్దరు మధ్య మధ్యలో ఛలోక్తులు విసురుతూ కల్యాణాన్ని రక్తి కట్టించారు. సమయానికి జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగల్యధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తలంబ్రాల కార్యక్రమం భక్తులకు కనివిందుగా సాగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు.
వైభవంగా స్వామివారి కల్యాణం
Published Thu, Feb 13 2014 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement